తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ సంస్థ తాము ఇండియాలో కొత్త పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి కచ్చితమైన ఒప్పందాలు కుదుర్చుకోలేదని ప్రకటించింది. తమ చైర్మన్ యంగ్ లియు ఇటీవల ఆ దేశాన్ని విజిట్ చేసినప్పుడు తన పర్యటన సందర్భంగా ఇలా ఒప్పందాలు కుదుర్చుకోలేదని తాజాగా ఈ సంస్థ పేర్కొంది. యాపిల్ ఐ ఫోన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ ఇందుకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలను తోసిపుచ్చింది.
కర్ణాటకలో ఏర్పాటు కానున్న భారీ ప్లాంట్ లో ఐ ఫోన్ల విడిభాగాల తయారీకి 700 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలన్న యోచనలో ఈ సంస్థ ఉందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. దీనిపై చర్చలు, అంతర్గత సమీక్ష జరుగుతున్నాయని, ఆర్ధిక సంబంధ పెట్టుబడుల విషయంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే తాము ఇలాంటి సమాచారాన్ని విడుదల చేయలేదని ఫాక్స్ కాన్ స్పష్టం చేసింది.
ముఖ్యంగా కర్ణాటకతో బాటు తెలంగాణా ప్రభుత్వం కూడా ..తాము ఈ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఇటీవల తెలిపింది. ఫాక్స్ కాన్ నేతృత్వంలోని హాన్ హాయ్ సంస్థ రాష్ట్రంలో మెగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందని, దీనివల్ల సుమారు లక్షమంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ సంస్థ చైర్మన్ యంగ్ లియు గత ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల 4 వరకు ఇండియాలో పర్యటించారు. అయితే తన ఈ విజిట్ సెమి కండక్టర్ల వంటి నూతన రంగాల్లో సహకారాన్ని కోరేందుకు ఉద్దేశించినదేనని ఆయన తన అధికారిక స్టేట్మెంట్ లో స్పష్టం చేశారు.
పాత స్నేహితులను కలుసుకోవడం, భాగస్వామ్యాన్ని పటిష్టపరచుకోవడం, సెమికండక్టర్లు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటివాటితయారీలో సహకారాన్ని పెంపొందించుకోవడం తన టూర్ ఉద్దేశమని అన్నారు.
తమ కంపెనీ అభివృద్ధి అవకాశాలను దృష్టిలో నుంచుకొని స్థానిక ప్రభుత్వాలతో తమ కమ్యూనికేషన్ సంబంధాలను కొనసాగిస్తామన్నారు. నిజానికి ఈ నెల 2 న ఈయనకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు మధ్య ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. కొంగర కలాన్ లోని 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటుకు ఈ సంస్థ.. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని వార్తలు వచ్చాయి.