జాతీయవాదం పేరిట జరిగిన ఫ్రాడ్ ని కప్పిపుచ్చలేరని హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ వ్యాఖ్యానించింది. అదానీ గ్రూప్ చేసిన మోసాలను దేశీయ భక్తితో పోల్చడమేమిటని ప్రశ్నించింది. తమ ఆరోపణలను ఖండిస్తూ అదానీ గ్రూప్ 413 పేజీల సుదీర్ఘ వివరణపై స్పందించిన హిండెన్ బెర్గ్.. తాము లేవనెత్తిన ప్రతి ఆరోపణకు సరైన సమాధానం లేకుండా వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని, మధ్యలో జాతీయ దృక్పథాన్ని ప్రస్తావిస్తున్నారని ఎదురు దాడికి దిగింది.
అదానీ సంపదను, ఆయన ఎదుగుదలను భారత విజయాలతో పోలుస్తున్నారని, దీంతో తాము ఏకీభవించబోమని పేర్కొంది. నిజానికి ఇండియా అతి పెద్ద ప్రజాస్వామిక దేశం.. ఉజ్వల భవితవ్యంతో సూపర్ పవర్ గా ఎదుగుతున్న దేశం..కానీ అదానీ గ్రూప్ కారణంగా ఆ దేశ భవితవ్యం వెనక్కి మళ్లుతుందని భావిస్తున్నాం.. భారత జాతీయ పతాకం కింద దేశాన్ని ఒక పథకం ప్రకారం దోపిడీ చేస్తున్న సంస్థ అని హిండెన్ బెర్గ్ సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
ప్రపంచ కుబేరుల్లో ఎవరు ఫ్రాడ్ చేసినా అది ఫ్రాడ్ అవుతుంది తప్ప మరేమీ కాదని ఆరోపించింది. ఇక అదానీ గ్రూప్ తన 413 పేజీల రిపోర్టులో ..హిండెన్ బెర్గ్ నివేదిక అంతా అబధ్ధాలతో కూడుకున్నదని, ఇండియా ప్రతిష్టను మంట గలపడానికి ఒక వ్యూహం ప్రకారం పన్నిన కుట్ర అని ఆరోపించింది.
తమ లాభాల కోసం తప్పుడు దురుద్దేశాలతో ఈ నివేదికను విడుదల చేశారని పేర్కొంది. ఇదంతా ఇండియా పైన, ఈ దేశ ఇండిపెండెన్స్, ఇంటెగ్రిటీ పైన, భారతీయ సంస్థలపైనా పథకం ప్రకారం జరిగిన దాడి అని దుయ్యబట్టింది. ఉజ్వల భారతావని ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఓ విదేశీ సంస్థ యత్నిస్తోందని నిప్పులు కక్కింది. హిండెన్ బెర్గ్ పై తాము కోర్టుకెక్కుతామని మొదట హెచ్చరించిన అదానీ గ్రూప్.. ఆ తరువాత తాము కూడా రెడీ అంటూ హిండెన్ బెర్గ్ సవాలు చేయగానే.. వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది.