‘తిన్నింటి వాసాలు లెక్కేయటం’ అనే సామెత తెలిసే ఉంటుంది. ఇక్కడ ఓ ప్రబుద్ధుడు కూడా తాను పని చేస్తున్న సంస్థకే టోకరా వేసి సంస్థ మనుగడకే ముప్పు తెచ్చాడు. యాజమాన్యంతో ఉద్యోగాల పేరు చెప్పి ఏకంగా రూ.2.06 కోట్లు కాజేశాడు. చివరికి అనుమానం వచ్చిన సంస్థ అతడిని విచారించే లోపే జెండా ఎత్తేశాడు.
హబ్సీగూడలో ‘యాప్ అప్లికేషన్స్’ అనే ఓ మొబైల్ యాప్స్ రూపొందించే కంపెనీ ఉంది. 20 మందికి పైగా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. మేనేజర్‌గా చేరిన ఓ వ్యక్తి కొంతకాలం నమ్మకంగానే పని చేశాడు. తర్వాత కొత్తగా నాలుగు ఉద్యోగాలు సృష్టించి నెలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతంగా నిర్ణయించాడు. ఉద్యోగులు లేకపోయినా.. వారి పేర్లతో ఏడాదిన్నరగా జీతాల రూపంలో ఆ డబ్బును తానే తీసుకున్నాడు.
అయితే, ఇటీవల సంస్థకు చెందిన బ్యాంక్ బిజినెస్ అకౌంట్ నుంచి డబ్బులు తగ్గుతూ వస్తున్నాయి. జీతాలు, ఇతరత్రా నిర్వహణ ఖర్చులను మించి అకౌంట్ నుంచి డబ్బుల మాయమవుతుండటంతో అనుమానించిన యజమాన్యం అకౌంట్స్ సిబ్బందిని ప్రశ్నించాడు. బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తెప్పించుకుని సరిచూడగా పెద్ద మొత్తంలో డబ్బులు ఇతరులు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ అవుతున్నట్లు తేలింది.
ఆలస్యంగా గుర్తించిన సంస్థ యాజమాన్యం ఆ మోసగాడిపై హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైమ్స్ అధికారులు తెలిపారు.