కరోనా కష్టకాలంలో జనానికి సాయం చేసి నటుడు సోనుసూద్ తన మంచి మనసు చాటుకున్నాడు. అతను చేసిన సాయానికి ప్రతీ ఒక్కరు సోనుసూద్ ను కలియుగ దాన వీర శూర కర్ణ అని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను సోనుసూద్ కొనసాగిస్తున్నారు. అయితే.. ఆయన ఫౌండేషన్ పేరు చెప్పి ఓ మహిళ నుంచి డబ్బులు కాజేశాడు ఓ కేటుగాడు. పోలీసులు ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ మీర్ పేట పీఎస్ పరిధిలోని గుర్రంగూడ శ్రీనివాసపురం కాలనీకి చెందిన సంధ్య.. తన బంధువుల్లో ఒకరికి కేన్సర్ వచ్చిందని వారికి సాయం చేయాలనుకుంది. ఈ క్రమంలోనే డబ్బు కోసం ట్విట్టర్ వేదికగా సోనుసూద్ ఫౌండేషన్ సాయం కోరింది. చికిత్సకు అవసరమయ్యే డబ్బులు సమకూరుతాయని భావించింది.
అయితే.. ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి సంధ్యకు ఫోన్ వచ్చింది. తాను సోనుసూద్ ఫౌండేషన్ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పిన సదరు వ్యక్తి.. మొబైల్ లో ఎనీ డెస్క్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించాడు. దాంతో సంధ్య ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంది. అలా ఆమెను మాటల్లో పెట్టి.. ఫోన్ పే యాప్ లోకి వెళ్లి బ్యాంక్ డెబిట్ కార్డును స్కాన్ చేయించాడు. అనంతరం ఫౌండేషన్ నుంచి డబ్బులు పంపిస్తానని మాయ మాటలు చెప్పి.. ఓటీపీ తెలుసుకున్నాడు. అలా సదరు ఓటీపీ ద్వారా సంధ్య బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.68 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకున్నాడు.
తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయని తెలుసుకుని మోసపోయానని సంధ్య చివరకి గ్రహించింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ ఎవరు అడిగినా చెప్పొద్దని సూచిస్తున్నారు ఖాకీలు.