భాగ్యనగరంలో మోసాలకు కొదవే లేదు. గుడిని మింగేవాడు ఒకడైతే.. గుడితోపాటు లింగాన్ని మింగేవాడు మరొకడు. మోసాల్లోనూ ట్రెండ్ సెట్ చేసేవాడు ఇంకొకడు. రోజూ ఎక్కడో ఒక చోట ఏదో ఫ్రాండ్ పని బయటపడుతూనే ఉంటుంది. తాజాగా క్రిమినల్స్ కే ఆదర్శంగా నిలుస్తున్న దంపతుల బాగోతం వెలుగుచూసింది. ఏకంగా సీఎంవో పేరుతోనే డబ్బులు దండుకున్నారు.
శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి దంపతులు. వీరిద్దరూ గ్రోవెల్ ఎడ్యుకేషనల్ కెరియర్ సర్వీసెస్ పేరుతో కాచిగూడలో సంస్థలు ఏర్పాటు చేశారు. పేరు మోసిన విద్యాసంస్థల్లో సీట్లు ఇప్పించడం, రాయబారాలు నడపడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అయితే.. రానురాను వీళ్లు దారి తప్పారు. సీట్ల విషయంలో డబ్బులు దండుకోవడం అలవాటు చేసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు.
ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేశారు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి. మెడికల్ సీట్ కి రూ.50 లక్షల నుండి కోటి రూపాయలు తీసుకున్నారు. అలాగే, ఇంజనీరింగ్ సీటుకి రూ.10 లక్షల నుండి 16 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. గత రెండున్నరేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. వీళ్ల చేతిలో చాలామంది మోసపోయారు.
శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డి బాధితులు ఒక్కటై పోరాటం చేస్తున్నారు. ఐదు నెలలుగా వీరిని వెంబడిస్తున్నారు. తమ డబ్బు కావాలని నిలదీస్తున్నారు. అయితే.. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు శ్రీధర్ రెడ్డి, సంధ్యారెడ్డిలను పట్టుకోలేదని ఆరోపిస్తున్నారు. పోలీసులు సహకరిస్తే తమ డబ్బు వెనక్కి వస్తుందని చెబుతున్నారు.