లోకేష్ పాదయాత్రలో వరాల జల్లు కురిపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఇర్రంగారిపల్లిలో చంద్రగిరి యువతతో నారా లోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..’ ప్రస్తుతం టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ బస్ పాస్ ఇస్తున్నారని.. తెలుగు దేశం అధికారంలోకి వస్తే పీజీ వరకు ఉచిత బస్సు పాస్ అందజేస్తాం. ఇక వసతి విద్యా దీవెనను రద్దు చేసి నేరుగా కాలేజీలకే ఫీజులు చెల్లిస్తాం. స్టేట్ బోర్డ్ సిలబస్ కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా మార్పు చేసి విద్యా బోధనలో సమూల మార్పులు తీసుకొస్తాం. 31 రోజుల పాదయాత్రలో నాలో చాలా మార్పు వచ్చింది. పాలసీలు నాలుగు గోడల మధ్య తీసుకునేది కాదు. పాలసీల వల్ల ప్రజలకి చెడు జరగకుండా ఉండాలంటే..ప్రజల మధ్య తీసుకోవాలి.
కేజీ నుంచి పీజీ వరకు మహిళను గౌరవించడం అనేది విద్యా బోధనలో భాగం కావాలి. అలాగే న్యాయవ్యవస్థలో కూడా సంస్కరణలు రావాలి. న్యాయవ్యవస్థకి సరైన వసతులు బడ్జెట్ కేటాయింపుల్లో పెరిగితే త్వరగా న్యాయం జరుగుతుంది. న్యాయం త్వరగా జరగకూడదు అనే దురాలోచనతోనే జగన్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆపేశారు. జైలు జగన్ పోయి..బ్రాండ్ బాబు రావాలంటే యువత ఓటు నమోదుపై దృష్టి పెట్టాలి.’ అని నారా లోకేష్ పిలుపునిచ్చారు.