తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ క్రమంలో వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అందించడానికి బీసీ మంత్రిత్వ శాఖ సకల సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగానే దాదాపు 50 కోట్ల రూపాయల ఖర్చుతో బీసీ స్టడీ సర్కిళ్లు, సెంటర్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా.. లక్షా 25 వేల మందికిపైగా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో బుధవారం సబ్ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో.. బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, 2, 3, 4తో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామకం చేసే పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై వివిధ రకాల ఉద్యోగాలకు పోస్టుల వారీగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.
అంతే కాదు, ఉచిత కోచింగ్‌తో పాటు గ్రూప్ 1 అభ్యర్థులకు నెలకు రూ.5 వేల చొప్పున ఆరు నెలల పాటు స్టైఫండ్ ఇస్తామని ఆయన వెల్లడించారు. అలాగే గ్రూప్ 2 అభ్యర్థులకు నెలకు రూ.2 వేల చొప్పున మూడు నెలల పాటు, ఎస్సై అభ్యర్థులకు రూ.2 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటన చేశారు. అయితే, ఫ్రీ కోచింగ్‌ను 1.25 లక్షల మందికి ఇచ్చినా.. స్టైపెండ్‌ను మాత్రం కేవలం 10 వేల మందికే ఇవ్వనున్నారు.
వార్షికాదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న వారు బుధవారం నుంచి ఈ నెల 16 వరకు ఫ్రీ కోచింగ్‌కు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని గంగుల సూచించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు 21వ తేదీ నుంచి క్లాసులు నిర్వహిస్తామని వెల్లడించారు మంత్రి గంగుల కమలాకర్. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయి ర్యాంకులు కూడా ఇస్తామన్నారు. హైబ్రిడ్ నమునాలో శిక్షణ పొందే వారు ప్రాక్టీసింగ్‌కు కూడా అవకాశం ఉంటుందని చెప్పారు.
మరోవైపు ఉద్యోగ నియామకాల కోసం సన్నద్ధమయ్యే ఎస్సీ అభ్యర్థులకు కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ తెలిపింది. 33 జిల్లా కేంద్రాల్లో స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో చోట 75 నుంచి 150 మంది వరకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలకు ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. డిగ్రీ పూర్తైన వారు దీనికి అర్హులని, మార్కుల శాతం ఆధారంగా శిక్షణకు ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు భోజన వసతి కోసం రోజుకు 75 రూపాయలతో పాటు 1500 రూపాయల విలువైన స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ వార్షికాదాయం మూడు లక్షల్లోపు ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. శిక్షణ కోసం tsstudycircle.co.in ద్వారా ఈ నెల 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.