భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ పాలక మండలి. తిరుమల కొండపైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. శుక్రవారం విజయనగరం జిల్లా రాజాంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు నాలుగంచెల విధానంలో దర్శనం కల్పిస్తున్నామన్నారు. రోజు వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ఆదరణ తగ్గిన టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. అలాగే టీటీడీ ఆధీనంలో 60కి పైగా ఆలయాలు ఉన్నాయని తెలిపారు. వాటి సరసన రాజాంలోని బాలాజీ ఆలయం కూడా చేరిందన్నారు.
జీఎంఆర్ కోరిక మేరకు టీటీడీ పాలకమండలి ఆమోదంతో రాజాంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం విలీనం చేసుకున్నట్లు వివరించారు. తిరుపతి లడ్డూను త్వరలోనే రాజాం ఆలయంలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
తిరుమలలో ఈ నెల 30వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి ఆస్థానం జరగనుందని చెప్పారు. 30వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు హనుమంత వాహనంపై భక్తులకు స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. 31వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం జరిపిస్తామని చెప్పారు.
కాగా గురువారం 19 కంపార్ట్ మెంట్లలలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది. గురువారం 59,776 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 25,773 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.72 కోట్లు వచ్చింది.