టెక్నాలజీ ఇంత పెరిగినప్పటికీ, తరాలు మారినప్పటికీ ఇంకా ఆడ పిల్లలంటే కొంతమంది అశుభం గానే పరిగణిస్తున్నారు. కానీ మరికొంత మంది మాత్రం ఆడ పిల్లలు పుడితే ఇంటికి లక్ష్మీ దేవి వచ్చిందంటూ పండగలు, సంబరాలు జరుపుకుంటున్నారు. అలా ఆడపిల్ల పుట్టిందని సంతోష పడే వారి ఇంటికి నిజంగానే లక్ష్మీ దేవి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే ఇంట్లో ఆడపిల్ల ఉంటే అంత సందడిగా ఉంటుంది. “పాప పట్టీలు పెట్టుకుని ఇళ్లంతా గలగల చప్పుడు చేస్తూ తిరుగుతుంటే మా అమ్మ గుర్తొస్తుంది రా” అని ‘జయం’ సినిమాలో హీరోయిన్ తండ్రి అన్నట్టుగా చాలా మంది అనుకుంటున్నారు.
తాజాగా ఓ తండ్రి కూడా అలాగే అనుకున్నాడు. పాప పుట్టిందని ఏకంగా పానీపూరి సంబరం జరిపించాడు. వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ కు చెందిన పానీపూరి వ్యాపారి అంచల్ గుప్తా కూతురు పుట్టాలని ఎప్పటి నుంచో ఆ దేవుడిని వేడుకుంటున్నాడు. ఆయన మొదటి సంతానం మగ బిడ్డ. మొత్తానికి ఆయన ప్రార్థనలు ఫలించి ఆడపిల్ల పుట్టింది. ఇంకేముంది ఆయన ఆనందానికి అంతే లేకుండా పోయింది.
ఈ శుభ సందర్భం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాడు. బాగా ఆలోచించి ఏదో ఎందుకు తన వ్యాపారమైన పానీపూరీనే అందరికి ఫ్రీగా ఇవ్వాలనుకున్నాడు. అంతే 40 వేలు ఖర్చు పెట్టి స్థానికులకు ఫ్రీగా పానీపూరి పంపిణీ చేశాడు. పానీపూరీని ఇష్టపడని వాళ్లెవరు ఉంటారు. అందరూ ఆ పానీపూరి తినేసి ఆయన సంతోషంలో భాగం పంచుకున్నారు. పైగా ఆడపిల్లల తోనే భవిష్యత్తు బాగుంటుందని గుప్తా అంటున్నాడు.