మూడొందల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి రెండేళ్లుగా కష్టపడి హాలీవుడ్ రేంజిలో సాహో తీస్తే ఇంటా బయటా ఒకటే విమర్శల గోల…! అసలు ఎందుకిలా జరుగుతుంది..!? ఈ మూవీ డైరెక్టర్ సుజిత్ సొంత కథతో తీయలేదా..? ఫ్రెంచ్ మూవీని కాపీకొట్టాడా..!? ఇదే ప్రశ్న ఫ్రెంచ్ డైరెక్టర్ జెరోమ్ సల్లేని అడిగితే కచ్చితంగా ఔనని అంటాడు. తన లార్గో విచ్ మూవీని కనీసం కాపీ కొట్టడం కూడా చేతకాలేదని ఎద్దేవా కూడా చేస్తాడు. గతంలో అజ్ఞాతవాసి మూవీ డైరెక్టర్ కూడా ఇలాగే కాపీలో ఫెయిల్ అయ్యాడని ట్వీట్ వచ్చింది. కాపీ రీమేక్‌లు తీయాలంటే కాస్త క్లవర్ అయితేనే బెటరని ఫ్రెంచ్ డైరెక్టర్ ఫీలింగ్.
గతంలో ఎందరో కాపీలు కొట్టి సినిమాలు తీసి సక్సెస్ అయ్యారు. అలనాటి ‘మీనా’ యాజిటీజ్‌గా తీసుకుని చేసిన మోడరన్ మూవీ ‘అఆ’ బాగానే అలరించింది. మరి ఆ విషయంలో త్రివిక్రమ్ స్టయిలే డిఫరెంట్. ఆ మాటకొస్తే తన సినిమాలు తనే కాపీ కొడుతుంటాడు. ఇద్దరు హీరోయిన్లు.. అక్కని ప్రేమించి చెల్లిని పెళ్లిచేసుకోవడం.. ప్రేమలో పడేయడానికి కొన్ని బిల్డప్ సీన్లు.. ఏ మూవీ చూసినా ఇవి కామన్ పాయింట్లుగా వుంటాయి.
ఎన్టీఆర్ వాడేవీడు… అమితాబ్ డాన్ దగ్గరి పోలికల మూవీలు. డాన్ రీమేక్ ఎన్టీఆర్ యుగంధర్. ఇదే సబ్జెక్టుతో రీసెంటుగా తీసిన తమిళ్ బిల్లా, తెలుగు బిల్లా సక్సెస్ మూవీలుగా నిలిచాయి.
ఇక ఎన్టీఆర్ దేవాంతకుడు మూవీని కొంత మార్చి ఎన్టీఆర్ యమగోల తీసి సూపర్ హిట్ కొట్టారు. అదే సబ్జెక్టు కాస్త అటు ఇటు తిప్పి చిరంజీవి యముడికి మొగుడు తీస్తే అదీ సూపర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కాపీ మూవీలు. టాలెంట్ ఉంటే కాపీ కూడా అసలు కంటే మిన్నగా తీయొచ్చంటారు ఫ్రెంచ్ డైరెక్టర్. సాహో డైరెక్టర్ కాపీలో సక్సెస్ కాలేదని సెటైర్..!!