”నిర్భయ” కేసులో దోషులకు ఢిల్లీ కోర్టు తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. మార్చి 3 వ తేదీన ఉదయం 6 గంటలకు ఉరిశిక్ష విధించాలని డెత్ వారెంట్ లో ఆదేశించింది. దోషుల ఉరికి డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడోసారి. గతంలో రెండు సార్లు డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ ల కొన్ని పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున్న ఆ డెత్ వారెంట్లపై కోర్టు స్టే ఇచ్చింది. న్యాయం కోసం దోషులు పెట్టుకున్న పిటిషన్లన్నింటిని కొట్టి వేయడంతో తాజా డెత్ వారెంట్ కోసం కింది కోర్టు నాశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో వారికి ఉరిశిక్ష విధించాలంటూ నిర్భయ తల్లి వేసిన పిటిషన్ పై ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జీ ధర్మేందర్ రానా సోమవారం డెత్ వారెంట్ జారీ చేశారు.
దోషి నిరాహార దీక్ష
మరణ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఉన్న అన్ని న్యాయ మార్గాలు మూసుకుపోవడంతో నలుగురు దోషుల్లో ఒకరు జైల్లో నిరాహార దీక్షకు దిగినట్టు జైలు అధికారులు సోమవారం కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో తెలిపారు. మొత్తం నలుగురు దోషుల్లో ముగ్గురు అన్ని అవకాశాలు కోల్పోయారు. పవన్ గుప్తాకు మాత్రం ఇంకా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది.
Advertisements
తాను జైల్లో హింసతో మానసిక వ్యాధికి గురయ్యానని క్షమాభిక్ష పిటిషన్ లో వేడుకున్నా రాష్ట్రపతి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని మరో దోషి వినయ్ సింగ్ తెలిపారు. అయితే ఫిబ్రవరి 12 న కేంద్రం సమర్పించిన మెడికల్ రిపోర్ట్ లో అతను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంది.
2012 లో ఢిల్లీలో పారా మెడికల్ విద్యార్దిని ”నిర్భయ”ను బస్సులో దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం కదులుతున్న బస్సులో నుంచి కిందకు తోసేశారు. ఈ కేసులో కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించింది. వారిలో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా నలుగురు మిగిలారు. దోషులు చట్టంలోని లొసుగులను అవకాశంగా తీసుకుంటూ మరణ శిక్ష అమలు కాకుండా తప్పించుకుంటున్నారు. శిక్ష విధించి కొన్నేళ్లయినా ఇప్పటి వరకు అమలు కాలేదు. వారికి ఉరిశిక్ష విధించడానికి ఢిల్లీ కోర్టు గతంలో రెండు సార్లు డెత్ వారెంట్ జారీ చేసినప్పటికీ పలు రకాల పిటిషన్లు వేస్తూ శిక్ష అమలు జాప్యం జరిగేలా చేస్తున్నారు. ఈ కేసు అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ”నిర్భయ”పేరుతో చట్టాన్ని కూడా తీసుకొచ్చారు.