గత కొద్ది రోజులుగా ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో భారీగా మంచు కురుస్తోంది. కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ ను మంచు దుప్పటి పరుచుకుంది. ఎంతో ప్రసిద్ధి చెందిన గంగోత్రి ఆలయం మంచుతో కప్పుకుపోయింది.
మరోవైపు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన జోషిమఠ్ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర తెల్లటి నురుగలాగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో కూడా ఉష్టోగ్రతలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి.
దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. రోడ్ మార్గాలు, ఇళ్లు పూర్తిగా మంచులో కప్పడిపోయాయి. ముఖ్యంగా నరకంద ప్రాంతంలోని రహదారిని హిమపాతం ముంచెత్తింది. రోడ్లకు ఇరువైపులా భారీగా మంచు పేరుకుపోయింది.
దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. కొండలపై నుంచి భారీగా మంచు గడ్డలు కిందకు పడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.