ఒక సెల్‌ఫోన్ రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. తన ఫోన్ దొంగలించి ఇవ్వలేదని మనస్థాపంతో ఒకరు బలవన్మరణానికి పాల్పడితే.. మృతికి కారణ కారణమంటూ గ్రామ పెద్దలు విధించిన పరిహారం చెల్లించలేక మరొకరు ఉరేసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామంలో నీరడి మహేశ్(30) సెల్‌ఫోన్‌ను అదే గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి దొంగిలించాడు. దీంతో మనస్థాపం చెందిన మహేశ్ ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13న సాయంత్రం మహేష్ మృతి చెందాడు.
దీంతో మహేశ్ మృతికి సాయిలు కారణమని అతని ఇంటి ముందు మృత దేహంతో మహేష్ బంధువులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని మహేష్ కుటుంబానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని సాయిలు కుటుంబానికి సూచించారు.
అయితే, పెద్దలు విధించిన పరిహారం చెల్లించలేక ఎడపల్లి మండలం బ్రహ్మణపల్లి సమీపంలోని అడవిలో శనివారం రాత్రి ఉరేసుకుని సాయిలు(27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.