తెలంగాణలో ప్రభుత్వం వసతి గృహాల్లో అధికారుల నిర్లక్ష్యం రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్ధులు తినే బ్రేక్‌ఫాస్ట్, భోజనంలో ఒకసారి సాలెపురుగు, మరోసారి బొద్దింక కనిపించగా.. నేడు తెలంగాణ యూనివర్సిటీలో కప్ప కనిపించడం కలకలం రేపుతోంది.
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని తెలంగాణ మహిళా వర్షిటీలో కప్ప రావడంతో.. వీసీ ఛాంబర్ ఎదుట విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వర్శిటీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులతో అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించారు పీడీఎస్ యూ నాయకులు.
ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. నేడు వర్సిటీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారి నిర్లక్ష్యంతో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటి ఘటన మరిచిపోకముందే మరో సారి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమే అని మండిపడ్డారు.
జరిగిన ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా 450 మంది విద్యార్థులకు ఓకే గర్ల్స్ హాస్టల్ సరిపోవడం లేదని.. అదనంగా మరొక గర్ల్స్ హాస్టల్ ను నిర్మించాలని డిమాండ్ చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలా వందల మందిని ఒకే చోట ఉంచడం మంచిది కాదని అన్నారు.