భారతదేశంలో ఎవరి నమ్మకాలు వారివి. వర్షాభావ సమయంలో కప్పల జంటకు పెళ్లిళ్లు చేస్తే జోరుగా వర్షాలు కురుస్తాయని కొందరి నమ్మకం. ఒక కర్రకు వేపాకు కట్టి రెండు కప్పల్ని వేలాడదీసి ఆ వేపాకుపై నీళ్లు చల్లుతూ కప్పతల్లి నీళ్లాడే అంటూ పాటలు పాడుకుంటూ వాటికి పెళ్లి చేయడం ఓ ఆచారం.
ప్రస్తుతం ఆ ఆచారం రివర్స్ అయింది. భారీ వర్షాలు బాధ పడలేక మావిడాకులు కాస్తా మా.. విడాకులుగా మారాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్లో పెళ్లయిన రెండు నెలల తర్వాత కప్పల జంటకు విడాకులు ఇప్పించేశారు. ఎందుకయ్యా ఇలా.. అంటే భారీ వర్షం బాధ పడలేక పోతున్నామండీ బాబూ.. అందుకే ఈ డైవోర్స్ అంటూ బదులిచ్చారు.
నెటిజన్లు దీనిపై ఎవరికి తోచిన కామెంట్లు వారు చేశారు. ఒకరైతే ఎంచక్కా ఆహ్వానం మూవీలో మాదిరిగా విడాకుల మహోత్సవం జరపాలని ట్వీట్ ఇచ్చారు. ఈ కాన్సెప్ట్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. మరొక నెటిజన్ మగ కప్ప ఆడ కప్పకు భరణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంతకూ ఏ తలాక్ ఇచ్చినట్టు అంటూ.. మరో నెటిజన్ ప్రశ్నించారు. మరొకయితే చంద్రమండల యాత్ర చేస్తున్న ఈ ఆధునిక యుగంలో ఈ గిరిజన ఆచారాలు, పుక్కిటి పురాణ నమ్మకాలు తగదని ట్వీట్ ఇచ్చారు.
ఎవరు ఎన్నిఅన్నా కూడా ఇప్పుడీ కప్పల జంటకు విడాకులైతే మంజూరయ్యాయి. మరి వాన తిప్పలు ఆగుతాయా ?