తెలంగాణ మొత్తం ఒక లెక్క అయితే.. వరంగల్ జిల్లాలో మరో లెక్క ఉంటుంది. నిజంగానే వరంగల్ లో కథ వేరే ఉంటది. వరంగల్ గ్రామస్థుల రాజకీయాల లెక్క వేరే ఉంటది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, వైఎస్ జగన్, బండి సంజయ్ నుంచి ఇప్పుడు వైఎస్ షర్మిల వరకు ఈ మాట నిజమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినా.. వరంగల్ ప్రజలు తమ ఆగ్రహాన్ని నేతలపై నేరుగా ప్రదర్శిస్తూనే ఉంటున్నారు. చాలా మంది నేతలకు వరంగల్ ప్రజల ఆగ్రహం తెలిసిందే. తాజాగా ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై కూడా వరంగల్ ప్రజలు తమ ఆగ్రహాన్ని చూపించారు.
ఆమె ప్రచార రథానికి కొందరు నిప్పుపెట్టారు. పాదయాత్ర వాహనాలపై రాళ్లు రువ్వారు. ఫ్లెక్సీలు తగలబెట్టి షర్మిల గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో.. ముందు జాగ్రత్తగా షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. దీనంతటీకీ కారణం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలే అయినా.. ఇది తరతరాలుగా వస్తున్న ప్రజాగ్రహ ఆచారాన్ని మరోసారి గుర్తు చేశాయి. అయితే వరంగల్ లో నెలకొన్న పరిస్థితులు ఎక్కడా తలెత్తకపోవటం గమనార్హం.
2008లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా వరంగల్ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ప్రజారాజ్యం పార్టి పెట్టిన కొత్తలే ఆయన వరంగల్ జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా చిరంజీవి నర్సంపేటలో రోడ్ షో నిర్వహించారు. అయితే.. రోడ్ షోలో చిరంజీవి ప్రసంగిస్తున్న సమయంలో.. ప్రత్యేక తెలంగాణ అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు ఆయనపై కోడిగుడ్లు విసిరారు. ఇలా తనపైకి దూసుకు వచ్చిన రెండు గుడ్ల నుంచి చిరంజీవి తప్పించుకున్నారు. కానీ ఒకటి మాత్రం ఆయన తలకు తగిలింది. ఈ ఘటనపై ఏ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయని చిరంజీవి తన యాత్రను కొనసాగించారు. అక్కడి నుంచి వెళ్లిన చిరు.. చెన్నారావు పేటలో తలపై, చొక్కపై పడిన కోడిగుడ్డు మరకలను శుభ్రం చేసుకుని.. దండలు వేసినవారికి వందనాలు.. కోడి గుడ్లు వేసినవారికి అభివందనాలు అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై అప్పట్లో మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.
అలాగే 2010లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా వరంగల్ ప్రజల ఆగ్రహం ఎదురైంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కన్నుమూత అనంతరం.. ఆయన అభిమానులను ఓదార్చేందుకు ఓదార్పు యాత్రను తలపెట్టారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో ఈ యాత్ర శాంతియుతంగానే కొనసాగింది. కానీ వరంగల్ లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. వరంగల్ జిల్లాలో అప్పటికే జగన్ షెడ్యూల్ చేసుకోగా.. బాంబ్ బెదిరింపులు వచ్చాయి. ఓదార్పు యాత్ర కొనసాగిస్తే కాన్వాయ్ ను బాంబులతో పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. తన యాత్రను కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆరోపణలు చేశారు. అయితే వరంగల్ లో పరిస్థితుల గురించి సీనియర్లు హెచ్చరించటంతో జగన్ ఆ షెడ్యూల్ ను అర్ధాంతరంగా రద్దుచేసుకోవాల్సి వచ్చింది.
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర విషయంలోనూ ఇలాంటి సీనే రిపీటయ్యింది. అంతకు ముందు బండి సంజయ్ యాత్ర మూడు విడుతలు ప్రశాంతంగానే కొనసాగినా.. వరంగల్‌లో ప్రవేశించే సరికి సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ నేతలపై ప్రధానంగా ఎమ్మెల్సీ కవితపై తీవ్ర విమర్శలు చేయటంతో.. అక్కడ ఇరువర్గలు ఘర్షణకు దిగారు. కర్రలతో కొట్టుకునే స్థాయికి కార్యకర్తలు వెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. పాదయాత్ర ఆపేయాలంటూ నోటీసులు సైతం ఇచ్చారు. ఈ విషయం కాస్త.. హైకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే.
ఈ వరంగల్ ప్రభావం లేటెస్ట్ గా నవంబర్ 28వ తేదీన ప్రారంభిస్తోన్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రపై కూడా పడింది. వరంగల్ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భైంసాలో పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. తెలంగాణ మొత్తం పరిస్థితి ఎలా ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరిస్థితి వేరు అన్న వాదన గట్టిగా వినబడుతోంది.