డిజిటల్ వాలెట్లు, యూపీఐ యాప్ లు వచ్చాక ఆన్‌లైన్ లో కేవలం కొన్ని సెకన్లలోనే నగదును అవతలి వారికి పంపించగలుగుతున్నాం. కొన్ని సెకన్లలోనే బిల్లులను చెల్లిస్తున్నాం. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనకు అనేక రకాల యూపీఐ యాప్‌లు అందుకోసం అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్‌కు చెందిన గూగుల్ పే యాప్ కూడా ఒకటి. అయితే ఇందులోనే కాదు.. ఏ యూపీఐ యాప్‌లో అయినా నగదు పంపుకున్నా, బిల్లు చెల్లించినా.. ఇప్పటి వరకు ఎలాంటి చార్జిలను వసూలు చేయడం లేదు. కానీ గూగుల్ పే లో మాత్రం ఇకపై చార్జిలను వసూలు చేయనున్నారు.
సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ఇకపై తన గూగుల్ పే యాప్‌లో చేసే నగదు ట్రాన్స్ ఫర్‌లకు గాను ఫిక్స్‌డ్ ఫీజును వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఇటీవలే ఆ సంస్థ జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లకు గాను తమ పాలసీని మార్చింది. ఆ తరువాత గూగుల్ పేలో డబ్బుల ట్రాన్స్ ఫర్‌కు చార్జిలను వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ తెలిపింది.
ఐఏఎన్ఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. గూగుల్ సంస్థ గూగుల్ పే యాప్ లో యూజర్లు చేసే మనీ ట్రాన్స్ ఫర్‌లకు 1.5 శాతం చార్జిలను వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డులను ఉపయోగించి డబ్బులు పంపితే ఆ ఫీజును వసూలు చేయనుంది. ఇక ఆ డబ్బు బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు కనీసం 1 రోజు నుంచి గరిష్టంగా 3 రోజుల వరకు సమయం పడుతుంది.
ఇక ప్రస్తుతం యూజర్లు గూగుల్ పే యాప్‌తోపాటు Pay.Google.com అనే సైట్ ద్వారా కూడా ఆన్‌లైన్ మనీ ట్రాన్స్ ఫర్ సేవలను ఉపయోగించుకుంటున్నారు. కాగా ఈ సైట్ కేవలం ఈ ఏడాది చివరి వరకు మాత్రమే పనిచేస్తుందని, వచ్చే ఏడాది నుంచి ఈ సైట్ అందుబాటులో ఉండదని, అప్పటి నుంచి కేవలం గూగుల్ పే యాప్ మాత్రమే పనిచేస్తుందని.. గూగుల్ వెల్లడించింది. అయితే అకౌంట్ నుంచి అకౌంట్‌కు జరిపే లావాదేవీలపై చార్జిలు ఉంటాయా, ఉండవా.. అనే విషయంపై గూగుల్ స్పష్టత ఇవ్వలేదు.