కెప్టెన్ శివ చౌహన్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచు శిఖరంగా గుర్తింపు పొందిన సియాచిన్ యుద్ధ భూమిలా శివంగిలా దూసుకుపోతుంది. విధి నిర్వహణలో భాగంగా ఆమె అనితర సాధ్యమైన ఎన్నో ధైర్య సాహసాలను చూపుతోంది. ఆమె చేస్తున్న సాహస కృత్యాలకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఆర్మీ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసింది.
రాజస్థాన్‌లోని ఉదయపూర్ నివాసి అయిన కెప్టెన్ శివ చౌహాన్ గత జనవరిలో సియాచిన్ గ్లేసియర్‌పై కాలుమోపింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిలో అడుగుపెట్టిన మొదటి మహిళా సైనికురాలిగా రికార్డు సృష్టించింది.
సియాచిన్ యుద్ధ పాఠశాలలో ఒక నెల కఠినమైన శిక్షణ తర్వాత కెప్టెన్ శివ చౌహాన్‌ను సియాచిన్ గ్లేసియర్‌లోని కుమార్ పోస్ట్‌లో నియమించారు.కుమార్ పోస్ట్ సముద్ర మట్టానికి 14.5 వేల అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ 12 నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది.
కాగా, 11 ఏండ్ల వయసులో తండ్రిని కోల్పోయిన శివ చౌహాన్ తల్లి దగ్గరే పెరిగింది. ఉదయపూర్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత శివ NJR ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసింది. చిన్నప్పటి నుంచి ఆర్మీ యూనిఫాం ధరించాలని కలలు కన్న ఆమె ఆర్మీ సీడీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 2021లో కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరింది.