దేశంలో పెట్రో రేట్లు విరామం లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 9వ రోజు కూడా చమురు కంపెనీలు బాదేశాయి. పెట్రోల్‌పై 30పైసలు, డీజిల్‌పై 25 పైసల వరకు పెంచాయి. ప్రస్తుతం దేశంలో లీటర్ పెట్రోల్ రేట్ అత్యధికంగా ముంబైలో రూ.95.75 పలుకుతోంది. దీంతో వంద మార్క్ చేరేందుకు మరో 4 రూపాయల 25 పైసలు మాత్రమే ధర తక్కువగా ఉంది. దీంతో ఆ చారిత్రాత్మకమైన రోజు ఎప్పుడెప్పుడు రాబోతోందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పెట్రోల్ రేట్ పెరుగుతున్న ఆందోళన కంటే.. వంద రూపాయల మార్క్ చేరే ముందు చమురు కంపెనీలు ఎలాంటి సస్పెన్స్‌ను కొనసాగిస్తాయోనని గమనిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ రేట్లపై అనేక సెటైర్లు, ట్రోలింగ్స్ జోరుగా సాగుతున్నాయి. “రూ.50కి చేరిన పెట్రోల్ రేట్.. కానీ అరలీటర్‌కే” అని ఒకరు పోస్ట్ పెడితే.. మరో పోస్టులో ” రూ.100 రూపాయలకు ఎప్పుడు చేరుకుంటుందా అన్న సస్పెన్స్‌తో హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది.. ఎలాగూ పెంచేస్తారు కాబట్టి.. ఒకేసారి వంద రూపాయలకు పెంచి.. ఆ తర్వాత కొన్నాళ్లు రేట్ల పెంపునకు బ్రేక్ ఇవ్వండి .. “అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్‌కు రూ.92.84, డీజిల్ రూ.87.20 పలుకుతోంది. ఈ ఏడాది అంటే నెలన్నర రోజుల్లో పెట్రోల్, డీజిల్‌పై రూ.6 వరకు పెరిగింది. మొత్తం 11 సార్లు ధరలు పెరిగాయి..