దేశంలో ట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఆ ప్రభావం నిత్యవసర వస్తువుల ధరలు, వంట నూనె ధరలపై కూడా పడింది. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర విషయం వెల్లడైంది. ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇంధన వినియోగం బాగా తగ్గిందని తెలుస్తోంది.
దేశంలో మార్చి నెలతో పోలిస్తే పెట్రోల్ విక్రయాలు ఈ నెలలో.. దాదాపు 10 శాతం తగ్గగా.. డీజిల్ వినియోగం 15.6 శాతం మేర పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, వంటగ్యాస్ వినియోగం కూడా 1.7 శాతం డ్రాప్ అయ్యింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు.
కరోనా మహమ్మారి వైరస్ విజృంభణ సమయంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ డిమాండ్ పెరుగుతూనే వచ్చింది. కానీ ప్రస్తుతం దానికి కూడా డిమాండ్ తగ్గిపోయింది. కాగా, ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య 1.12 మిలియన్ టన్నుల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. ఇది గతేడాది ఇదే తేదీలతో పోలిస్తే 12.1 శాతం అధికంగా కాగా.. 2019 మార్చితో పోలిస్తే 19.6 శాతం ఎక్కువ. అదే మార్చి నెల తొలి అర్ధభాగంతో చూసినప్పుడు 9.7శాతం తగ్గడం గమనార్హం.
ఇక, ఇదే సమయంలో 3 మిలియన్ టన్నుల మేర డీజిల్ విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోల్చినప్పుడు ఇది 7.4 శాతం అధికం కాగా.. 2019 మార్చితో పోలిస్తే 15.6 శాతం ఎక్కువ. మార్చితో పోల్చినప్పుడు మాత్రం 15.6 శాతం తగ్గడం గమనార్హం.