ఖలిస్థానీ నేత అమృత్ పాల్ సింగ్ ఈ నెల 18 న పారిపోయే ముందు చూపిన ‘విలనిజం’ తాజాగా బయటికొచ్చింది. ఆ రోజున జలంధర్ సమీపంలోని ఓ గురుద్వారాలో చొరబడిన ఇతగాడు. సినీ విలన్ ని తలపించాడు. ఆ రోజున తన సహచరులతో ఈ ప్రార్థనా మందిరంలోకి దూసుకువచ్చిన అమృత్ పాల్.. సుమారు గంట సేపు అక్కడ ఉన్నాడట.. తన తలపాగా తీసేసి.. షర్ట్, ప్యాంట్ ధరించి తన వేషధారణనే మార్చేశాడు.
ఈ గురుద్వారా లోని ఓ గురువు కుమారుడి పింక్ టర్బన్ ని చుట్టుకోవడమే గాక అతని ఫోన్ నుంచి హర్యానాలోని రేవారీలో ఎవరితోనో మాట్లాడాడని పోలీసు వర్గాలు తెలిపాయి. రెండు మోటార్ సైకిళ్లను తీసుకురావాలని తన సహచరులను ఆదేశించాడని, తన కారును గురుద్వారాకు సుమారు వంద మీటర్ల దూరంలో వదిలేసి ఓ మోటార్ బైక్ పై పరారయ్యాడని తెలిసింది.
పైగా ఆ రోజున గురుద్వారాలో తనకు ఫోన్ ఇచ్చిన గురువు కొడుకు పెళ్లి ఉండగా.. వారు గెస్టుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో అమృత్ పాల్ అక్కడికి చేరుకున్నాడని, దీంతో వీళ్లే గెస్టులయి ఉండవచ్చునని అమాయక పెళ్ళివారు భ్రమపడ్డారని తెలిసింది. కానీ తాను పారిపోయే హడావిడిలో ఉన్న అమృత్ పాల్.. ఫుడ్ త్వరగా పెట్టమని, కొన్ని బట్టలు ఇవ్వాలని గన్ చూపి వారిని బెదిరించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
ఇతని కోసం వరుసగా ఐదో రోజు కూడా గాలిస్తున్న పంజాబ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అన్ని విమానాశ్రయాల వద్ద అలర్ట్ హెచ్చరికలను ఉంచారు. నన్ను అరెస్టు చేసే దమ్ము మీకుందా అని పోలీసులను సవాల్ చేస్త్తున్న అమృత్ పాల్ సింగ్ .. వారికి పక్కలో బల్లెమయ్యాడు. రాష్ట్రంలో 80 వేలమంది పోలీసులు, భద్రతాదళాలు ఉన్నా ఇతడిని పట్టుకోలేకపోవడంపై పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. పోలీసులు బుధవారం ఇతడి తల్లిని, భార్యను ప్రశ్నించారు. అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ బ్రిటన్ కు చెందిన ఎన్నారై అని, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యురాలని తెలుస్తోంది. అమృత్ పాల్ వేషాలు మారుస్తుండడంతో పోలీసులు ఇతని పాత, కొత్త ఫోటోలను విడుదల చేస్తున్నారు.