రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు సచివాలయం. అక్కడ పనిచేస్తే.. ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉద్యోగులు సెక్రటెరియట్ అంటే హాడలిపోతున్నారు. ఎందుకు అనుకుంటున్నారా…?
తెలంగాణ సచివాలయం కొత్తది నిర్మించాలన్న కారణంతో తాత్కాలికంగా బీఆర్‌కే భవన్‌కు మార్చారు. దాదాపు అన్ని డిపార్ట్‌మెంట్స్ బీఆర్‌కే భవన్‌కు షిప్ట్ అయిపోయాయి. కానీ ఉద్యోగులు మాత్రం అక్కడ పనిచేసేందుకు సుముఖత చూపటం లేదు. అది పూరతన భవనం కావటం పైగా ఎన్నో ఏళ్లుగా ఆ భవనం ఎక్కువగా ఉపయోగంలో లేదు. ఇరుకుగా గదులున్నాయి. సరైన వెంటిలేషన్ కూడా లేదు. ఇక వరుస వర్షాలకు తోడు పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ కంపు కొడుతోంది. సాగర్ నుండి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో పారిశుధ్యం లోపం కారణంగా ఉద్యోగులంతా జ్వరంతో బాధపడుతున్నారు. కొందరికైతే ఏకంగా డెంగ్యూ సోకిందని తెలుస్తోంది. ప్రస్తుతం 900మంది ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక బీఆర్‌కే భవన్‌కు కొత్తగా ఎస్.పి.ఎఫ్ సిబ్బందితో కాపలా ఏర్పాటు చేశారు. వారంతా దోమకాటుకు గురై, సెలవులపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఇంకా మరమ్మత్తుల పేరిట ఇంకా పనులు నడుస్తుండటంతో ఉద్యోగులు ఆవస్థలు పడుతున్నారు.
సరైన ఏర్పాట్లు కూడా చేయకుండా బలవంతంగా బయటపడేశారు. ఇక్కడ ఏదీ సరిగ్గా లేదంటూ ఉన్నతాధికారులు అవసరమైతే తప్పా… అటు వైపు చూడటం లేదు. దాదాపు రెండు నెలలు గడుస్తున్నా రినోవేషన్ పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. లిఫ్టులు ఏవీ సరిగ్గా పనిచేయటం లేదు. డ్రైనేజీ వ్యవస్థ పురాతనమైనది కావటం, ఉద్యోగులు ఎక్కువవటంతో దుర్వాసన వస్తుందని ఉద్యోగులు ఆవేధన చెందుతున్నారు. పైగా సచివాలయం కూల్చివేతకోసం అగ్ని ప్రమాదాలు జరిగితే, ఉద్యోగులెవరూ బయటపడలేరంటూ ప్రభుత్వం కోర్టుకు సాకులు చెప్పిందో… బీర్కే భవన్‌లోనూ ఎలాంటి ఫైర్ సెఫ్టీ సదుపాయాలు లేవని తెలుస్తోంది.
పైగా బీఆర్‌కే భవన్ పురాతనమైనది. 1983లో కట్టడం పూర్తయింది. మొత్తం నాలుగు బ్లాకుల్లో ఉండే సచివాలయాన్ని సింగిల్ బిల్డింగ్‌కు మార్చటంతో… భవనానికి ఏమైనా అయితే, ఇంత మందిని ఈ బిల్డింగ్ మోస్తుందా అంటూ ఉద్యోగులు మదనపడుతున్నారు. సీఎం చెప్పారని ఉన్నతాధికారులు తలుపుతూ మమ్మల్ని ఇక్కడ పడేశారని, అసలు దీన్ని సచివాలయం అని ఎవరైనా అంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొత్త భవన నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తయి, అక్కడకు షిఫ్ట్ అవుతామో అంటూ నిట్టూర్చుతున్నారు.