ఇండియాపై కొన్ని విదేశీ శక్తులు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి. భారత దేశ ప్రతిష్టను మంట గలపడమే కాక దేశాన్ని చిన్నచూపు చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇండియా ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందడాన్ని చూసి సహించలేని శక్తులు ఏదో ఒకరకంగా ఇరకాటాన పెట్టడానికి ఈ శక్తులు .. అమెరికా, స్పెయిన్ వంటి దేశాల్లో వార్తాపత్రికలను వినియోగించుకుంటున్నాయి. భారత ఎకానమీ బలహీనంగా ఉందని చూపడానికి స్పెయిన్ లోని ఓ పత్రిక మొదటి పేజీలో ప్రచురితమైన ఓ కార్టూన్ ఇందుకు నిదర్శనం. పాములు పట్టే ఓ వ్యక్తి బూర ఊదుతున్నట్టున్న కార్టూన్ ఇది.
తాజాగా అమెరికాలోని వాల్ స్ట్రీట్ జర్నల్ డైలీ మొదటి పేజీలో పబ్లిష్ అయిన యాడ్ విషయానికే వస్తే.. ఇందులో ప్రధాని మోడీని, ఆయన కేబినెట్ సహచరులను, కొందరు ఉన్నతాధికారులను చిన్న చూపు చూస్తున్నట్టున్న ఈ యాడ్ పై ఇండో-అమెరికన్ ఆశా జడేజామోత్వానీ .. ట్విట్టర్లో మండిపడ్డారు. హిందూ ద్వేషపరులు కావాలనే ఈ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారని ఆమె అన్నారు. మోడీ ప్రభుత్వంపై ఇది పెద్ద యుధ్దమన్నట్టుగా ఇందులో చూపారని.. ఇలాంటి తప్పుడు, అబద్ధాలతో కూడిన సమాచారాన్ని ఇచ్చిన ఈ డైలీకి సిగ్గుచేటని పేర్కొన్నారు. అయితే ఈ యాడ్ ఎప్పుడు పబ్లిష్ అయిందో ఆమె వివరించలేదు.
ఈ యాడ్ లో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, యాంట్రిక్స్ గ్రూప్ చైర్మన్ రాకేష్ శశిభూషణ్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు జడ్జీలు హేమంత్ గుప్తా, వి. రామసుబ్రమణ్యన్, స్పెషల్ పీసీ యాక్ట్ జడ్జి చంద్రశేఖర్, సిబిఐ డీఎస్పీ ఆశిష్ పరీక్, ఈడీకి చెందిన సంజయ్ కుమార్ మిశ్రా, ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్. రాజేష్ వంటివారి పేర్లున్నాయి. ఇంకా ఈడీ డిప్యూటీ డైరెక్టర్ సాదిక్ మహమ్మద్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకట్రామన్ పేర్లు కూడా ఇందులో ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు.
ఈ అధికారులు .. భారత, అమెరికా దేశాల మధ్య సంబంధాలను నీరుగార్చడానికి చూస్తున్నారని, తమ రాజకీయ, బిజినెస్ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని ఈ ప్రకటన పేర్కొంది. ఫలితంగా ఇండియాలోని వాతావరణం ఇన్వెస్టర్లకు అనుకూలంగా లేదని, అందువల్ల ఇండియాపైన, ఈ అధికారులపైన ఆర్ధిక ఆంక్షలను విధించాల్సిందిగా తాము అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఈ యాడ్ ఇచ్చిన శక్తులు కోరాయి. గ్లోబల్ మెగ్నిస్కీ హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద ఈ చర్య తీసుకోవాలని పేర్కొన్నాయి. మోడీ ప్రభుత్వ హయాంలో చట్టాలు నీరుగారుతున్నాయని, పెట్టుబడులకు ఇండియా సురక్షిత దేశం కాదని, ఇన్వెస్ట్మెంట్లు పెడితే ప్రమాదంలో పడతారని హెచ్చరించాయి. ‘వాంటెడ్ మోడీస్ మెగ్నెస్కీ 11’ పేరిట ఈ యాడ్ ప్రచురితమైంది.
గోవిందరాజన్ అనే మరో ట్విటర్ యూజర్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఇండియా మీద ఇంత బాహాటంగా విషం కక్కుతున్నట్టున్న ఈ యాడ్.. భారత ఎకానమీ వృద్ధిని దిగజార్చేలా చూపడానికి చేసిన యత్నమేనని ఆయన అన్నారు. విపక్షాలతో సహా అన్ని పార్టీలు దీన్ని ఖండించాలని, ఇండియా పట్ల ద్వేషం వెలిగక్కుతున్నవారి ఆట కట్టించాలని ఆయన కోరారు.