
మరో మూడు వారాల్లో దసరా నవరాత్రులు వస్తున్నాయి. పిల్లలకి సెలవుదినాలు ప్రారంభం కానున్నాయి. దాంతో ఇప్పటి నుంచే రైళ్ల ప్రయాణాలకు ప్లానింగ్ మొదలైపోయింది. దాంతో టిక్కెట్ల బుకింగ్‌లో రద్దీ పెరిగిపోయింది. సెలవులు పూర్తయ్యే రోజుల్లో అంటే.. అక్టోబరు 8, 9 తేదీల్లో ఏ ట్రైనులోనూ అస్సలు ఖాళీ లేదు. టిక్కెట్లన్నీ బుకింగ్ అయిపోయాయి. కొన్ని రైళ్లలో వెయిలింగ్ లిస్టు చాలా ఎక్కువగా ఉంది. చాలామంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొన్నారు. మిగిలిన వాళ్లంతా ఇక తత్కాల్ కోటా టిక్కెట్‌లు, ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడాలి. ఈనెల 29వ తేదీ నుంచే దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఆలోపే పాఠశాలల్లో పిల్లలకు క్వార్టర్లీ పరీక్షలు నిర్వహించి సెలవులు ఇస్తారు. దసరా నవరాత్రులు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగుళూరు, మైసూరు వంటి నగరాల్లో బాగా జరుపుకుంటారు. సంక్రాంతి తరువాత అంతే పెద్ద పండగ కావడంతో అందరూ తమతమ స్వస్థలాల్లో ఘనంగా జరుపుకొనేందుకు సెలవులు పెట్టి వెళ్తుంటారు. సురక్షితం కావడంతో చాలామంది రైళ్లలో ప్రయాణాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. స్పెషల్ రైళ్లలో టిక్కెట్లు రేట్లు పెంచుతారనే ఉద్దేశంతో అందరూ రెగ్యులర్ రైళ్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. అందుకే ముందుచూపుతో రెండు, మూడు నెలలు ముందుగానే టిక్కెట్‌లు బుకింగ్ చేసుకొన్నారు. ఈ కారణంగానే అక్టోబరు 8, 9 తేదీల్లో టిక్కెట్లకు వెయిటింగ్ లిస్టు కొనసాగుతోంది. బస్సు బుకింగ్స్ కూడా తక్కువగా ఏం లేవు. టీఎస్ఆర్టీసీ, ఎపీఎస్ ఆర్టీసీలలో బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ఒక వారం ముందు నుంచి రష్ వుంటుంది.