తెలుగువారికి ఏ ఆపద వచ్చినా ముందుండి ఆదుకున్న చేతులతనివి. అందులోనూ తెలంగాణ వ్యక్తి అని తెలిస్తే చాలు.. కొత్తగా అమెరికాలో అడుగు పెట్టినవారికి అన్నింటా అండగా నిలిచేవాడు. విదేశాలకు వచ్చి కోట్లు గడించాలనే అందరిలా కోరుకోకుండా.. సంపాదనలో అధిక భాగం ఇతరులకు సాయం చేసేందుకే ఖర్చుపెట్టేవాడు. అలాంటి గొప్ప మనసున్న తెలంగాణవాసి నలమాద దేవేందర్‌రెడ్డి.. న్యూజెర్సీలో కారుకు నిప్పంటుకున్న ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఎన్నారైలను కలచివేస్తోంది. అమెరికాలో అడిగినవారికి లేదనకుండా సాయం చేసిన దేవేందర్ రెడ్డి కుటుంబం.. ఆయన మరణంతో ఇప్పుడు అక్కడ అనాధలా మారింది.
దేవేందర్ రెడ్డికి భార్య అనురాధతో పాటు ఏడేళ్ల కూతురు చెర్రి ఉంది. ప్రస్తుతం న్యూజెర్సీలోనే ఉన్నవారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.దీంతో దేవేందర్ రెడ్డి స్నేహితులు, ఆయన నుంచి సాయం పొందినవారంతా.. ఆయన కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో మందికి సాయం చేసిన ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేయడంతో పాటు… ఆన్‌లైన్‌లో ఫండ్ సేకరిస్తున్నారు. ఇందుకోసం సాయాన్ని అర్థిస్తున్నారు.
TRSకు అమెరికాలో అధికార ప్రతినిధిగా కూడా ఉండేవారు దేవేందర్ రెడ్డి. ఎన్నో సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి సాయం చేశారు. తెలంగాణ సొసైటీని ఏర్పాటు చేసి.. సేవలు అందిస్తున్నాడు. అమెరికాలోనే కాదు.. లాక్‌డౌన్ సమయంలో అయితే ఇండియాలో కష్టాలుపడుతున్న వారికోసం అక్కడ తానూ జోలె పట్టాడు దేవేందర్ రెడ్డి. ఎన్నారైల చుట్టూ తిరిగి.. నిధులు సేకరించి అవసరమైన వారికి సాయం చేయాలని స్నేహితులకు పంపాడు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిని విధి బలితీసుకోవడం ఎంతో మందిని కంటతడిపెట్టిస్తోంది.
దేవేందర్ రెడ్డి కుటుంబానికి సాయం చేయాలనుకునేవారు.. ఈ లింక్ ఓపెన్ చేసి అండగా నిలబడవచ్చు.