2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై సుమారు గంటన్నర పాటు ప్రసంగించారు. ఈ బడ్జెట్ మహిళలు, యువత, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఆశాదీపం వంటిందని ఆమె అన్నారు.
ఈ బడ్జెట్‌లో తెలంగాణలోని పలు సంస్థలకు కేటాయింపులు చేశారు. ఇందులో ఐఐటీ హైదరాబాద్‌కు (ఈఏపీ కింద) రూ. 300 కోట్లు, సింగరేణికి రూ. 1,650 కోట్లను కేటాయించారు. తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయించారు. ఇక వాటా పరంగా చూసుకుంటే కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ. 41, 338 కోట్లు, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లుగా ఉంది.
వీటితో పాటు మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ. 1,473 కోట్లను కేటాయించారు. మంగళగిరి, బీబీనగర్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ. 6,835 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 37 కోట్లు, సాలార్జంగ్ సహా అన్ని మ్యూజియాలకు రూ. 357 కోట్లను కేటాయించారు.
ఏపీలోని పెట్రోలియం వర్సిటీకి రూ. 168 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ రూ. 47 కోట్లు, పెట్రోలియం యూనివర్సిటీకి రూ. 168 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 683 కోట్లు కేంద్రం కేటాయించింది. ఇక చిరు ధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయడంలో భారత్ ముందుందని ఆమె వెల్లడించారు.
చిరుధాన్యాలను తన ప్రసంగంలో శ్రీ అన్న అని వ్యహరించారు. వీటిని వినియోగిస్తే ప్రజలకు పోషకాహారం అందుతుందని, ఆహార భద్రత కూడా ఉంటుందన్నారు. దీంతో పాటు రైతుల సంక్షేమం కూడా సాధ్యమవుతుందని గతంలో ప్రధాని మోడీ ఈ విషయాన్ని చెప్పారని ఆమె పేర్కొన్నారు.
ప్రపంచానికి భారత్ ను శ్రీ అన్న కేంద్రంగా మార్చడంలో భాగంగా హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మార్చనున్నట్లు ఆమె చెప్పారు. తద్వారా శ్రీ అన్న సాగుకోసం మేలైన పద్ధతులు సహా ఇతర పరిశోధనలకు ప్రోత్సాహం అందుతుందన్నారు.