పాత సినిమాల్లో మార్కెట్ యార్డ్ లో విలన్లు దుఖానా దారులను బెదిరించి డబ్బులు వసూలు చేసేటి సీన్లు చూసి ఉంటారు. నిత్య జీవితంలో అది సాధ్యపడదు అనుకొని కూడా ఉంటారు చాలా మంది. కానీ.. అదంతా జూజూబీ అన్నట్టే తయారైంది. సినిమాలను తలపించే విధంగా వసూలు చేయడం నిత్య జీవితంలో కూడా మొదలైంది.
తాజాగా.. అలాంటి ఘటన భాగ్యనగరం హైదరాబాద్ లో వెలుగుచూసింది. అఫ్జల్ గంజ్ పరిధిలోని పూల మార్కెట్లో వసూలు రాయుళ్ల వీరంగం ఎక్కువయింది. పూలు అమ్ముకొని జీవనం గడుపుతున్న చిరు వ్యాపారులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.
జీహెచ్ఎంసీ పేరుతో వ్యాపారులను బెదిరిస్తూ.. డబ్బులు వసూలు చేస్తూ ఎలాంటి రషీదు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. వారానికి మూడు సార్లు మార్కెట్లో చేరి సుమారు 300 దుకాణాలలో.. ఒక్కో దుకాణంలో రూ.500 నుండి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొట్ట కూటి కోసం చిరు పూల వ్యాపారం పెట్టుకొని జీవనం సాగిస్తున్న తమపై బల్దియా సిబ్బంది జులుం చూపిస్తున్నారని తమ గోడును చెప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు జాంబాగ్ పూల వ్యాపారులు.