దక్షిణ అయోధ్యగా పేరొందిన తెలంగాణలోని పుణ్యక్షేత్రం భద్రాద్రి రామాలయంలో భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీరాముడి ప్రసాదంలో బూజుపట్టిన లడ్డూలు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్ పై ‘ఇచ్చట బూజు పట్టిన లడ్డూలు అమ్మబడును’ అని రాసిన పేపర్ ను అతికించి నిరసన తెలిపారు.
లడ్డూల నాణ్యతను అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. గతంలో కూడా ఈ ఆలయంలో ఇలాంటి ఆరోపణలు వచ్చాయని అయినప్పటికీ అధికారులు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు.
ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో రాములవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు పంచేందుకు 2 లక్షల లడ్డూలను ఆలయ అధికారులు తయారుచేయించారు. పండుగ పూర్తయిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని నిల్వ చేసే విషయంలో ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు.
దీంతో పెద్ద సంఖ్యలో లడ్డూలు బూజు పట్టాయి. అయినప్పటికీ వాటిని అలాగే కౌంటర్ లో పెట్టి సిబ్బంది అమ్ముతున్నారు. దీనిపై భక్తులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ సిబ్బందితో గొడవపడ్డారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.