ఆచార్య సినిమా విడుదలై ఇంకా వారం గడవలేదు.. మామూలుగా ఈ టైమ్ లో సినిమాలో నటించిన హీరోలు ఎక్కడికైనా వచ్చారంటే సక్సెస్ మీట్ అనుకుంటారు. లేదంటే ఆ సినిమాకు మరింత ప్రచారం కల్పించడానికి వచ్చి ఉంటారని అనుకుంటారు. కానీ ఆచార్య విషయంలో అలాంటివేం జరగడం లేదు.
చిరంజీవి ఫ్లయిట్ ఎక్కారు కానీ ఆచార్య ప్రచారం కోసం కాదు. తన భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. ఇక రామ్ చరణ్ కూడా ఫ్లయిట్ ఎక్కాడు. కానీ ఆచార్య ప్రమోషన్ కోసం కాదు, శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ కోసం వైజాగ్ వెళ్లాడు.
కానీ మీడియా మాత్రం హడావుడి మొదలుపెట్టింది. వైజాగ్ లో ఆచార్య సక్సెస్ మీట్ అంటూ కథనాలు వండేసింది. అరె.. అసలు ఎవరికీ సమాచారం కూడా ఇవ్వలేదే అంటూ మరో వార్త. ఓవైపు చిరు-చరణ్ ఆచార్య బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటే, మరోవైపు మీడియా ఇలా సక్సెస్ మీట్, సక్సెస్ పార్టీ అంటూ కామెడీ చేస్తోంది.
ఇప్పటికే తీవ్ర నష్టాలు మిగిల్చింది ఆచార్య సినిమా. థియేటర్ల నుంచి డబ్బులు రావడం దాదాపు ఆగిపోయింది. ఎక్స్ ట్రా డబ్బుల కోసం అమెజాన్ లో కాస్త ముందుగానే స్ట్రీమింగ్ కు అనుమతినిచ్చేశారు. ఇలాంటి టైమ్ లో మరో ఈవెంట్ అంటే అది నిర్మాతలకు తలకుమించిన భారం అవుతుంది. పైగా.. ఫ్లాప్ అయిన సినిమాకు సక్సెస్ మీట్ అంటే, అది చిరంజీవికే అవమానం. అందుకే అంతా సైలెంట్ గా పక్కకు తప్పుకున్నారు. ఎవరి పనులు వాళ్లు చూసుకుంటున్నారు.