హైదరాబాద్ వేదికగా జీ 20 ఆర్థిక సదస్సు శనివారం వేడుకగా ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల కన్వెషన్ సెంటర్ లో జరుగుతున్న ఈ సదస్సుకు సుమారు 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. కాగా దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్‌కతాలో జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్ వేదికగా నిలిచింది.
ఇప్పటివరకు 25 నగరాల్లో 36 సదస్సుల నిర్వహించగా ఈ ఏడాది జీ-20 సదస్సుకు ఇండియా ప్రాతినిథ్యం వహిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాధల అంశంపై మూడురోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా డిజిటల్ ఎకానమీ రంగంలో ఇండియా సాధించిన విజయాలపై సదస్సులో ప్రస్తావించనున్నారు ఇండియా ప్రతినిధులు.
అలాగే 2030 నాటికి ఇండియా లక్ష్యాలను ఇతర దేశాల ప్రతినిధులకు వివరించనున్నారు. గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్‌క్లూజన్ (జీపీఎఫ్‌ఐ) పేరుతో జరుగుతోన్న ఈ సదస్సులో జీ 20 దేశాల ప్రతినిధులతోపాటు ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. కాగా శుక్రవారం జీ 20 ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా జీ -20 మాట్లాడుతూ .. ఫిలిప్పైన్స్, భూటాన్, ఈజిప్ట్, శ్రీలంక, థాయ్‌లాండే, వియత్నాం తదితర దేశాల నుంచి ప్రతినిధులు జీ 20 సమ్మిట్‌లో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యం, ఆర్థిక సమ్మిళిత, సమగ్రాభివృద్ధి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర అంశాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చిస్తారన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు ప్రణాళిక, జీ 20 యేతర దేశాల భాగస్వామ్యం, జీ 20తోపాటు ఇతర దేశాల్లో డిజిటల్ చెల్లింపులు తదితర అంశాల గురించి చర్చించనున్నట్టు వివరించారు