జీ-20 కూటమికి ఇండియా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఏడు ఈవెంట్లు జరగనున్నాయి. సెప్టెంబరులో జరగనున్న వీటికి సంబంధించి సన్నాహక ఏర్పాట్లకు అధికారులు క్రమంగా శ్రీకారం చుడుతున్నారు. 2010 లో కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా నాడు చోటు చేసుకున్న అనేక లోటుపాట్లను ఈ సందర్భంగా గుర్తించి అలాంటివాటికి ఆస్కారం లేకుండా ఈ ఈవెంట్లను గర్వకారణంగా నిర్వహించాలని యోచిస్తున్నారు. జీ-20 సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ఇంకా అనేకమంది ప్రముఖులు దేశంలోని వివిధ నగరాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నారు.
ముఖ్యంగా మొదట ఢిల్లీ నగరాన్ని వీటికి ‘కేంద్రబిందువు’ గా భావిస్తున్నందున అప్పుడే వివిధ స్థాయుల్లో అధికారుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. రానున్న 8, 9 నెలల్లో చేపట్టవలసిన ఆయా ప్రాజెక్టులు, వాటి కాలపరిమితులకు సంబంధించి అధికారులు ఇటీవలనగర లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనాకు ఓ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వీరితో కూడిన కోర్ కో-ఆర్డినేషన్ కమిటీ ..జీ-20 ని కామన్ వెల్త్ క్రీడలతో పోల్చడం విశేషం.
ఈ కమిటీలో టూరిజం, న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఢిల్లీ జల్ బోర్డు, పురావస్తు శాఖ వంటి వివిధ శాఖలకు చెందిన అధికారులున్నారు. నగర శానిటేషన్, బ్యూటిఫికేషన్, వంటివాటితోబాటు భారత సంస్కృతిని, ఢిల్లీ చరిత్రాత్మక లెగెసీని ప్రతిబింబించే కార్య్రక్రమాలను రూపొందిస్తున్నారు.
రూ. 11 వేల కోట్ల వ్యయంతో.. యూరోపియన్ ప్రమాణాలకు తగినట్టు నగర రోడ్లను ఆధునికీకరించాలన్నది కూడా వీటిలో ఒకటి. అలాగే విదేశీ ప్రముఖులు రావడానికి ముందే సిటీలోని అన్ని మార్కెట్లను ఆధునీకరిస్తున్నారు. వీధులు ఇక సోడియం లైట్లతో వెలగనున్నాయి.
బ్రిటన్ లో మాదిరి ప్రధాన రోడ్లపై పెడిస్ట్రియన్ పుష్ బటన్స్, పెడిస్ట్రియన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఫుట్ పాత్ లను మెరుగుపరచి..వాటి మరమ్మతులు చేపడుతున్నారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరానికి దారి తీసే రోడ్ల బ్యూటిఫికేషన్ అప్పుడే పూర్తి అయిందని ఓ అధికారి తెలిపారు. కాలాబధ్ధ ప్రణాళిక మేరకు అన్ని పనులను శీఘ్రగతిన చేపడుతున్నామని, ఢిల్లీని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.