వారికి వ్యవసాయమే జీవనాధారం. ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కానీ.. అధికారులు ఉన్నట్టుండి ఆ పొలం మీది కాదు.. ప్రభుత్వానిదని లాగేసుకున్నారు. కనీసం పుట్టిన రోజు నాడైనా తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుల్లో ఓ వ్యక్తి కేసీఆర్ కు లేఖ రాశాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కెసిఆర్ బర్త్డే స్సందర్బంగా నల్గొండ డిస్ట్రిక్ట్ కనగల్ మండల్ జి యడవల్లి గ్రామం లో ప్రభుత్వం పల్లె ప్రక్రుతి వనం పేరుతో లాక్కున్న 43 ఎకరాల పట్టాభూములు తిరిగి ఇవ్వాలని ! రైతులకి జీవనాదారం కల్పించాలని వేడుకుంటున్నారు?@KTRTRS @TelanganaCMO @jagadishTRS
😢🙏 pic.twitter.com/a0uDtAFH3p— Dharmendhar Gaddam (@DHARMENDHARGG) February 17, 2022
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం జీ యడవల్లిలో 25 మంది రైతులకు చెందిన 43.33 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమి అని తీసుకున్నారు అధికారులు. దీనివల్ల తరతరాలుగా ఆ భూముల్ని సాగు చేసుకుంటున్న రైతులు జీవనోపాధిని కోల్పోయారు. ఈ విషయాన్ని వివరిస్తూ.. ధర్మేందర్ అనే బాధితుడు తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి,భూపాల్ రెడ్డి,గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి లేఖ రాశాడు.
ప్రభుత్వానికి బాధితుడు రాసిన లేఖ..!
“నాపేరు ధర్మేందర్. నల్గొండ జిల్లా కనగల్ మండలం జి యడవల్లి గ్రామం. డిగ్రీ చేసిన నిరుద్యోగ యువ రైతు బిడ్డను. నాకు గ్రామ శివారులో సర్వే నెంబర్ 354(ఖాతా నెంబర్: 60229)లో కరం పొలం ఉంది. మా నాన్న నుంచి అది వారసత్వంగా 2018లో రిజిష్ట్రేషన్ అయింది. అప్పటి నుండి వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నా. నాకు రైతు బంధు సహాయం కూడా అందింది. గ్రామీణ సహకార బ్యాంకు లోన్ కూడా ఇచ్చారు. ఇప్పటికీ నా డిజిటల్ పట్టాదార్ పాస్ బుక్ బ్యాంకులోనే ఉంది. కానీ.. కనగల్ తహసిల్దార్ నా పొలం ప్రభుత్వ భూమి అని చెప్పి గతేడాది జూన్ 23న పల్లె ప్రకృతి వనానికి కేటాయించారు. అప్పటి నుండి జీవనోపాధి కోల్పోయాను. అది ప్రభుత్వ భూమి అయితే రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఇలా నేను ఒక్కడినే కాదు నాలా 25 రైతు కుటుంబాలకు చెందిన 43.33 ఎకరాల పట్టా భూమిని లాక్కొని రైతులను రోడ్డున పడేశారు. అందరూ జీవనోపాధి కోల్పోయారు. ఇప్పుడు వారిని ఎవరు ఆదుకోవాలి కేసీఆర్. అసలు తెలంగాణలో ప్రకృతి వనం 43.33 ఎకరాలలో ఎక్కడైనా పెట్టారా? రైతులు పండించే పంట పొలాల్లో ప్రవృతి వనం ఏంటి? మాది ఏమైనా అటవీ ప్రాంతమా? ఎందుకు రైతుల మీద దాడులు? బంగారు తెలంగాణలో రైతుల పరిస్థితి ఇంతేనా? కేసీఆర్ గారు.. మీకు రైతుల కన్నీటి గోసలు కనిపించవా? ఎన్నిసార్లు మిమ్మల్ని కలవాలని ట్రై చేసినా కలిసే అవకాశం దొరకలేదు? మమ్మల్ని అధికారులు పట్టించుకోవడం లేదు? న్యాయం చేయడం లేదు? మేము ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన రైతులం. మా దగ్గర ఉన్న 43.33 ఎకరాల భూములను జిల్లా కలెక్టర్ మెగా పల్లె ప్రకృతి వనంకి కేటాయించి.. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న రైతు కుటుంబాలని రోడ్డుకు లాగారు. 1999 సంవత్సరంలో ఎస్ఎల్‌బీసీ(ఏఎంఆర్‌పీ) నీటి పారుదల ప్రాజెక్ట్ కి కాలువ కట్ట కోసం మట్టి పోయడానికి బలవంతంగా అప్పటి ప్రభుత్వం భూ సేకరణ చేసింది. కానీ.. వాడుకోలేదు. పోజిషన్ లో మేమే ఉండి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. అప్పటి ఎస్ఎల్‌బీసీ కలెక్టర్ భూ యాజమాన్య హక్కులు కోల్పోకుండా యథావిధిగా వాళ్ళ హక్కు పత్రాలను, భూములను వాళ్ళకే ఇచ్చి జీవనాధారం కల్పించారు. కాబట్టి 1956 నుండి 2021 వరకు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాం. ఈ భూములు మా తాతల నుంచి వారసత్వంగా వస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా సమగ్ర భూ సర్వే చేసి మాకు డిజిటల్ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చారు. మాకు రైతు బంధు సహాయం కూడా అందింది. మేము బోర్లు వేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నాం. మాకు క్రాప్ లోన్స్ కూడా ఇచ్చారు. భూసేకరణ బాధితులకు కేంద్రం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మాకు ఇచ్చిన హక్కుల మేరకే మేము భూములపై సంపూర్ణ భూ యాజమాన్య హక్కులను కలిగి ఉన్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం చేసిన చట్టాలను అమలు చేయకుండా మా హక్కులను హరించివేసి మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురిచేస్తూ మా జీవితాలను రోడ్డుపాలు చేసింది. పైగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన జీవో 123 భూసేకరణ చట్టం ప్రకారం కేంద్రం చేసిన చట్టం కంటే బాగుంటుందని ప్రాజెక్ట్ గురుంచి సేకరించిన భూమిని పాక్షికంగా వాడుకోగా మిగిలిన భూములని రైతులు సాగు చేసుకోవచ్చని అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించారు. అలాగే సాగునీటి ప్రాజెక్ట్ కి భూములు ఇచ్చిన బాధితులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకున్నాగాని కనీసం మా భూములు మాకు వదిలేస్తే చాలు. మాకు జీవనాధారం కల్పిస్తే చాలు”.
ఇదీ.. జీ యడపల్లి రైతుల ఆవేదన.. పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి.. రైతు బంధు సాయం అందింది.. కానీ.. ప్రభుత్వ భూమి అని లాగేసుకున్నారు. దీనిపై కోర్టుకు వెళ్తే.. ఆలస్యం అవుతుందని న్యాయమూర్తి ప్రభుత్వతో చర్చలు జరపాలని సూచించారు. అయితే.. రోజులు గడుస్తున్నాయేగానీ.. సమస్య పరిష్కారం కోసం ఎవరూ ముందుకు రావడం లేదు. బాధితులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. తమ భూములు తమకు వచ్చేలా కేసీఆర్ చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు.