రష్యాపై జీ7 దేశాలు మండిపడ్డాయి. ఓ వైపు ఐక్యరాజ్య సమితి వారిస్తున్నప్పటికీ ఉక్రెయిన్ పై రష్యా మిసైల్స్ తో విరుచుకుపడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దమనకాండకు అధ్యక్షుడు పుతిన్ ను బాధ్యుడిగా పేర్కొంటూ రష్యాకు వార్నింగ్ ఇచ్చారు.
ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా అణ్వాయుధాలను వినియోగించినట్లైతే తీవ్ర పరిణామాలు తప్పవని జీ7 హెచ్చరికలు చేసింది. ఉక్రెయిన్ పై మిస్సైల్ దాడులను జీ7 దేశాలు ఖండించాయి. తక్షణ సహాయంగా
ఉక్రెయిన్‌కు సైనిక, రక్షణ అవసరాలు, సామాగ్రిని చేరవేసేందుకు జీ7 దేశాలు సంసిద్దత వ్యక్తం చేశాయి.
ఉక్రెయిన్ అవసరాలను తీర్చేందుకు తాము కట్టుబడిఉన్నామని జీ7 దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. మరోవైపు రష్యాను నిలువరించేందుకు జీ7 దేశాల సహాయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు.
తమకు గగనతల రక్షణ సామర్ధ్యాలను కల్పించాలని జీ7 దేశాలను ఆయన కోరారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని జీ7 సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.