రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో గద్దర్ కనిపించడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఇటీవల టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్న గద్దర్.. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
అటు టీఆర్ఎస్ తో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే.. ఇప్పుడు బీజేపీ బహిరంగ సభకు హాజరయ్యారు. అంతేకాకుండా దాదాపు గంటపాటు సభలోనే ఉండడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
సభ ముగిశాక ఎయిర్‌పోర్టులో అమిత్ షాను కలిసిన గద్దర్ ఆయనకు వినతిపత్రం అందించారు. ఆ సమయంలో ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు.
కాగా.. వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన కేసులతో గద్దర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన షాను కలిసి వినతిపత్రం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.