ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు ప్రజా గాయకుడు గద్దర్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల తరఫున పలు ప్రశ్నలు వేశారు.
సకల సంపదలు గల దేశంలో దరిద్రమెట్లుంది? ఇది మొదటి నుండి పాలించిన పాలకులదా? ప్రజలదా? పాలసీలలో లోపం ఉందా? తెలంగాణలో భూమి, నీరు, పని చేసేవారు ఉండగా దరిద్రమెట్లుంది? అని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజల ప్రశ్నలని తెలిపారు. వీటిపై సీరియస్ గా అసెంబ్లీలో చర్చ జరగాలని చెప్పారు.
పార్లమెంట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం కూడా రాజకీయాంశంగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు గద్దర్. నూతన సచివాలయం భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కూడా చేర్చాలని కోరారు గద్దర్. పార్లమెంట్ కు ఆయన పేరు పెట్టడం అనేది అసెంబ్లీలో చర్చ చేయాలన్నారు. అంబేద్కర్ పేరు పెడితే రాజ్యాంగాన్ని ఆచరించినట్టేనని అభిప్రాయపడ్డారు.