ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచే పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. మునుగోడు బై ఎలక్షన్ లో తమ పార్టీ అభ్యర్థిగా ప్రజా యుద్ధ నౌకగా పేరు గాంచిన ప్రజా గాయకుడు గద్దర్ పేరును ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా కేఏ పాల్ అమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న తాము నిర్వహించ తలపెట్టిన ప్రపంచ శాంతి ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పాల్ అమరణ దీక్షకు దిగారు. అయితే బుధవారం కేఏ పాల్‌ను కలిసిన గద్దర్.. ఆయనతో నిమ్మరసం తాగించి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున మునుగోడు బై ఎలక్షన్స్ బరిలో నిలవనున్నట్టుగా చెప్పారు. ఈ సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ.. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. గద్దర్ ప్రజా శాంతి పార్టీ తరఫున మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలవనున్నారని చెప్పారు. గద్దర్ కు టీఆర్ఎస్ అన్ని రకాల ఆఫర్‌లు ఇచ్చారని.. అయితే బడుగు, బలహీన వర్గాల పార్టీ అయిన ప్రజా శాంతి తరఫున మార్పు తీసుకురావడానికి గద్దర్ ముందుకు వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా గద్దర్‌కు 100 కోట్లు ఆఫర్ ఇచ్చి, ఎంపీ టికెట్ కూడా
ఇచ్చేందుకు రెడీ అయ్యారని. బీజేపీ నుంచి మోదీ, అమిత్ షాలు కూడా ఆఫర్స్ ఇచ్చారని అన్నారు. కానీ ఆయన ప్రజాశాంతి పార్టీకి మద్దతు ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు కేఏ పాల్.
అయితే గద్దర్ ఈ మధ్య బీజేపీ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలవడం ఒక ఎత్తు అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు గద్దర్. ఈ విషయం రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ప్రజా సమస్యలపై పాటలు పాడుతూ, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ వచ్చిన గద్దర్ బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
కాగా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించికాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేయగా, బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలవనున్నారు. బీఆర్ఎస్ బుధవారం రోజున ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గత కొద్ది రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన వీఆర్ఏలు కూడా మునుగోడు ఉప ఎన్నికలో మూకుమ్మడి నామినేషన్లు వేయాలని చూస్తున్నారు.
ఇక, ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు అక్టోబర్ 14 వరకు తుది గడవుగా నిర్ణయించారు. ఈ నెల 15న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇక, నవంబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.