గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ కూల్చివేతపై రాష్ట్ర హైకోర్టు స్పందించింది. మార్కెట్ కూల్చివేతలను వెంటనే నిలిపేవేయాలని తీర్పునిచ్చింది. వ్యాపారులు తమ వస్తువులు తీసుకునేందుకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. నెల రోజులు మార్కెట్ తెరవాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేస్తూ.. వందలాది పోలీసులతో మొహరించి మార్కెట్ కూల్చివేస్తున్నారని వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దానిపై స్పందించిన హైకోర్టు.. గడ్డి అన్నారం మార్కెట్ లో కూల్చివేతల తీరు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ లక్ష్మీబాయి కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది హైకోర్టు.
నగరానికి తలమానికంగా నిలిచిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ అధికారులు నేలమట్టం చేశారు. మార్కెట్ పై ఆధారపడి జీవిస్తున్న వ్యాపారులు.. గత 160 రోజులుగా చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు గండికొట్టారు. హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా ఫ్రూట్ మార్కెట్ ను కూల్చివేశారు.
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తెరవాలంటూ మార్కెటింగ్ శాఖకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 4వ తేదీన ఫ్రూట్ మార్కెట్ ను అధికారులు తెరిచారు. మూడు రోజులు గడవక ముందే మార్కెట్ కూల్చివేతలు చేపట్టారు. పండ్ల మార్కెట్ ఆవరణలోని పాతషెడ్లు, భవనాలను తొలగించారు
దీంతో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ వద్ద ఆందోళన నెలకొంది. మార్కెట్ మూసివేసేందుకు అధికారులు రావడంతో వ్యాపారులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు బందోబస్తు నడుము మార్కెట్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మార్కెటింగ్ శాఖ అధికారులు ఫ్రూట్ మార్కెట్ కూల్చివేతలు చేపడుతున్నారని తెలుసుకున్న వ్యాపారులు భారీగా తరలివచ్చారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. బందోబస్తు మధ్య మార్కెట్ ను పూర్తిగా తొలగించారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రజల కోసం 18 ఎకరాల విస్తీర్ణంలో గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఇక్కడే తమ వ్యాపారులు కొనసాగిస్తున్నారు.