మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏ డిజైన్ తో కట్టారని ప్రశ్నించారు. ఇంజనీరింగ్ లోపంతోనే ప్రాజెక్ట్ పంప్ హౌస్ లు మునిగిపోయాయని ఆరోపించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారని.. ఈ ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు ఇచ్చే మిషన్(ఏటీఎం)గా మారిందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్… జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలన్నారు షెకావత్. అవినీతి పరులను జైల్లో వేసేందుకే బీజేపీకి అధికారం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను కోరారు. రాష్ట్రంలో ముమ్మాటికీ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామని స్పష్టం చేశారు. ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రధాని మోడీ ఆదేశాలతో ఇక్కడికి వచ్చానన్న షెకావత్.. స్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎందరో పోరాటం చేసి, ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా అలాగే పోరాటం చేసి ప్రాణ త్యాగం చేస్తే… ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉందో చూస్తున్నామని చురకలంటించారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని.. ప్రజల కల నెరవేరలేదని విమర్శించారు. తెలంగాణలో ప్రతీ స్థాయిలో అవినీతి జరుగుతోందని.. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకి నిజమైన నివాళి ఇవ్వాలంటే.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనని సూచించారు.
తెలంగాణ ప్రజలు ఎందుకు పోరాటం చేశారో ఆ కలలు సాకారం కాలేదన్నారు కేంద్రమంత్రి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ‘‘కేసీఆర్ విను… బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన అభ్యర్థికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు.. అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే మద్దతుగా నిలిచారు. అణగారిన కులాలంటే ఆయనకు గిట్టదని అర్థం అవుతోంది’’ అంటూ మండిపడ్డారు గజేంద్ర షెకావత్.