సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకున్న ఎందరో యువకులు అగ్నివీర్ కారణంగా నిరుత్సాహానికి గురయ్యారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అగ్నివీర్ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తామని పేర్కొన్నారు. సైన్యం నియామకాల్లో తాము పాత విధానాన్ని పునరుద్దరిస్తామన్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర యూపీలోకి ఎంటర్ అయింది. ఈ రోజు యూపీలోని బాగ్ పాట్‌లో యాత్ర కొనసాగుతోంది. మావికలాన్‌లో ఈ రోజు యాత్రను ఉదయం 5 గంటల 16 నిమిషాలకు ఆయన ప్రారంభించారు. యాత్ర సిసానాకు చేరుకోగానే పలువురు యువకులు రాహుల్ గాంధీని కలిశారు.
అగ్నివీర్ ప్రక్రియ గురించి దేవీలాల్ చౌదరి సహా ఐదుగురు యువకులు రాహుల్‌తో సుమారు 25 నిమిషాల పాటు మాట్లాడారు. తాను అగ్నివీర్ రిక్రూట్ మెంట్ లో ఎంపికయ్యానని చెప్పారు. కానీ ఎలాంటి కారణం లేకుండానే నియామక ప్రక్రియను ఆపివేశారని దేవీలాల్ రాహల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్లాడు.
అగ్నివీర్ కారణంగా తన లాంటి చాలా మంది యువకులు ఎంపికైనప్పటికీ సైన్యంలో చేరలేకపోయారని దేవీలాల్ చెప్పాడు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నివీర్ నియామక ప్రక్రియను రద్దు చేస్తామన్నారు. సైన్యంలో నియామక ప్రక్రియను పాత విధానంలోనే చేపడతామన్నారు.