విజయవాడ : వినాయక చవితి పండుగ వస్తుందంటే వారం ముందుగానే సందడి మొదలయ్యేది. పండగ ముందు రోజే వెళ్లి అందంగా వున్న మట్టి విగ్రహాన్నివెతికి తెచ్చుకోవడం.. పండగ నాడు తెల్లవారక ముందే వెళ్లి పూలు, పత్రి తెచ్చి పాలవేదిక కట్టి స్వామి వారి పూజావేదికను సిద్ధం చేయడం.. తర్వాత ఇంటి పెద్ద ఆ వేదిక ముందు కూర్చుని, చుట్టూ పిల్లల్నికూర్చోబెట్టి వినాయక వ్రతం కల్పం పుస్తకం తీసి భక్తిగా వినాయకుణ్నికొలవడం.. ఇదంతా ఎంతో ఉత్సాహంగా ఉండేది. స్వామివారి పాదాల దగ్గర పిల్లలు తమ క్లాస్ బుక్స్ పెట్టి పసుపుతో ఓంకారం రాసి మంచి విజ్ఞానాన్నిఇవ్వాలని ప్రథమ దేవుణ్ని వేడుకోవడం తెలిసిందే. రెండు రోజులు గణపతిని అలానే వుంచి పూజించి, తర్వాత స్వస్తివచనం చెప్పి స్వామివారి చిన్నబొమ్మని తీసి ఊళ్లో మండపాల దగ్గర కొలువుదీరిన పెద్ద విగ్రహాల దగ్గర చేర్చేవాళ్లు. నవరాత్రులు పూర్తయ్యాక మళ్లీ నిమజ్జనం సందడి. నదుల్లో, చెరువుల్లో స్వామివారి విగ్రహాల్ని తీసుకెళ్లి నిమజ్జనం చేయడం దేశానికే పండగ.
ఇప్పుడు ట్రెండ్ మారింది. పల్లె నుంచి పట్నం దాకా అందరకీ బిజీ కాలం. పత్రి తెచ్చుకోవడం, విగ్రహాన్ని తీసుకొచ్చి పూజా వేదికను సిద్దం చేయడం ఇప్పటి తరానికి అంత ఆసక్తిమైనదేం కాదు. అదంతా అమ్మానాన్నల పనిగా వుంది పిల్లలకి. కాస్త ఏజ్ వచ్చిన పిల్లలు మాత్రం బయట గణేశ మండపాల దగ్గర సందడి చేస్తున్నారు. కొంతలో కొంత సంతోషమని పెద్దలు సరిపెట్టుకుంటున్నారు. హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రి వంటి నగరాల్లో మండపాల హడావుడి ఇంకా కొనసాగుతోందంటే అదీ గణేశ ఉత్సవాలకు ఉన్న ప్రత్యేకత. కులం, మతం, రాజకీయం.. ఏదీ తెలియని ఒకే ఒక సామాజిక ఉత్సవం గణేశ్ చతుర్ధి.
గణపయ్యకు మండపాల్లో భక్తి శ్రద్ధలతో రోజూ పూజలు చేశాక సాయంత్రం నుంచి ‘సాంస్కృతిక’ సందడి షూరూ అవుతుంది. భక్తి మరోలా మారుతుంది. సినిమా పాటలు హోరెత్తుతాయి. డ్యాన్సుల కోలాహలం మొదలవుతుంది. స్వామివారి ముందే ఈ తతంగమంతా. ఒకటే పోటాపోటీ..! ఇక సినీ ఆర్టిస్టులు, సెలెబ్రిటీలు వస్తారు. మండపాల్లో ఒకటే హంగామా…!
చివరిగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులు భారీ లైటింగ్, అలంకరణలు, మ్యూజిక్ డెక్‌లు, డీజేలు హోరెత్తిస్తాయి. కొన్ని గ్రామాల్లో రికార్డింగ్ డ్యాన్సులు శ్రుతి మించుతాయి. మందేసి యూత్ చిందులు.
పల్లెల్లో చెరువుల దగ్గరకి తీసుకెళ్లి నిమజ్జనం చేయడం పాతకాలం జరిగేవి. ఇప్పుడు ట్రెండ్ మారి దగ్గరలోని సముద్ర తీరాలకు తరలిపోతున్నారు. అక్కడే వినాయక నిమజ్జనాలు. ఈ తతంగం మాత్రం హుషారుగా సాగడం విశేషం.