కోకాపేట్..ఇక్కడి భూమి కాసులను కురిపిస్తోంది. ఈ ఏరియాలో యాభ్భై గజాలు స్థలమున్నా.. కరోడ్ పతియే. అందుకే కబ్జాకోరుల కన్ను కూడా ఇక్కడి స్థలాలపై ఎక్కువగా ఉంటుంది. రాత్రికి రాత్రి భూమిని కబ్జా చేసేస్తారు. తెల్లారే సరికే అక్కడ షెడ్లు వెలుస్తాయి..బోర్డులు మారిపోతాయి. ఇక భూ యజమాని న్యాయం కోసం కాళ్ళరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండదు.
తాజాగా ఇలాంటి సీన్ యే ఆదివారం అర్థరాత్రి కోకాపేట్ లో హల్ చల్ చేసింది. ఓ స్థలం దగ్గరికి ఉన్నట్టుండి ఓ భారీ కంటైనర్ ను ఏర్పాటు చేసిన ఓ వర్గం.. గ్యాంగ్ సభ్యులను కూడా అక్కడే కాపాలా పెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మరో వర్గం హుటాహుటిన అక్కడికి చేరుకోవడంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి..అది కాస్త గ్యాంగ్ ఫైట్ కు దారితీసింది.
ఈ ల్యాండ్ మాదంటే.. మాదని ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. తమ తమ సత్తాను చూపించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి రౌడీలను రప్పించుకున్నాయి రెండు గ్యాంగ్ లు. దీంతో కోకాపేట్ లో మిడ్ నైట్ నాలుగు గంటల పాటు ఈ గ్యాంగ్స్ హల్ చల్ చేశాయి. పరిస్థితులు దాటడంతో.. ఓ వర్గం 100 కి డయల్ చేసింది. పోలీసులు స్పందించకపోవడంతో కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంది. అయితే కాప్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అంతే కాదు..కొసమెరుపు ఏంటంటే.. సాధారణంగా పెట్రోలింగ్ లో ఉండే పోలీసులు కూడా అటు వైపు కన్నెత్తి చూడలేదు.
ఈ ఉద్రిక్తత నడుమ ఓ వర్గం చివరికి ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ కు చేరుకున్నా.. అక్కడ కూడా నో రెస్పాన్స్. అయితే ఓ కమర్షియల్ హిట్ సినిమాలో సీన్ ను తలపించేలా ఉన్న ఈ సంఘటన వెనుక మంత్రి హస్తముందని పుకార్లు. మినిస్టర్ కన్ను ఆ ల్యాండ్ పై పడడంతోనే ఇంత జరిగిందని.. అందుకే పోలీసులు కూడా సైలెంట్ గా తమాషా చూస్తున్నారని ఓ వర్గం వాపోతుంది. అయితే తమకు న్యాయం చేయాలని.. కబ్జా నుంచి తమ భూమిని కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.