నిన్నటివరకు చిరంజీవి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య పెద్ద హిట్టవ్వడం ఒకెత్తయితే, ఆ వెంటనే ఈనెలలో చిరంజీవి క్లాసిక్ మూవీ గ్యాంగ్ లీడర్ వస్తోందనేది వాళ్ల ఆనందానికి కారణం. లెక్కప్రకారం, మరో 3 రోజుల్లో, అంటే 11వ తేదీన గ్యాంగ్ లీడర్ రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడా సినిమా రిలీజ్ అవ్వడం లేదు.
11వ తేదీ కోసం ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. చాలామంది మెగా ఫ్యాన్స్ టికెట్లు కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడా షోలు అన్నీ రద్దయ్యాయి. దీనికి కారణం గ్యాంగ్ లీడర్ రీ-మాస్టరింగ్ పనులు ఇంకా పూర్తికాకపోవడమే.
ఈ సినిమాను విజువల్, ఆడియో పరంగా ఇప్పటి టెక్నాలజీకి తగ్గట్టు తీర్చిదిద్దుతున్నారు. ఆ పనులు ఇంకా కొలిక్కి రాలేదు. 11వ తేదీకి ప్రింట్ రెడీ అవ్వడం దాదాపు అసాధ్యమని తేలింది. దీంతో సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ప్రింట్ రెడీ అయిన తర్వాత కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ గ్యాప్ లో గ్యాంగ్ లీడర్ సినిమా కొత్త ట్రైలర్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. విజయ బాపినీడు డైరక్ట్ చేసిన ఈ సినిమాలో చిరు సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించింది.