దేశంలో సంచలనం సృష్టించిన సిద్ధూ మూసేవాలా హత్య కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు లారెన్స్ బిష్ణోయ్‌కి మాన్సా కోర్టు ఏడు రోజుల పోలీసు కస్టడీని విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ కు మొదట వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. అతన్ని బుధవారం తెల్లవారు జామున మాన్సా కోర్టులో హాజరుపరిచారు.
మూసేవాలా కేసు విచారణలో భాగంగా పదిరోజుల కస్టడీ కోరింది పోలీసు శాఖ. దీంతో విచారణ జరిపిన కోర్ట్.. 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. దీంతో అతన్ని ప్రశ్నించేందుకు మొహాలీకి తీసుకురానున్నారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పాత్రకు సంబంధించి గ్యాంగ్‌స్టర్ వ్యతిరేక టాస్క్‌ఫోర్స్ ఇతర ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక బృందం ప్రశ్నించనుంది.
బిష్ణోయ్‌కు పంజాబ్ పోలీసులు మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నుంచి ట్రాన్సిట్ రిమాండ్ విధించారు. సీఎం ఆదేశాల మేరకు పంజాబ్ అడ్వొకేట్ జనరల్ స్వయంగా ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరై రిమాండ్ విధించాలని డిమాండ్ చేశారు. పంజాబ్ పోలీసు కస్టడీలో అతని భద్రత కారణంగా నిందితుని యొక్క న్యాయవాదులు పంజాబ్ పోలీసుల అభ్యర్ధనను వ్యతిరేకించారు.
ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేసేందుకు అనుమతిని మంజూరు చేసింది. మే 29న సిద్ధూ మూసేవాలాను గుర్తుతెలియని వ్యక్తులు మాన్సా జిల్లాలో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న లారెన్స్ బిష్ణోయ్‌ని పోలీసులు ప్రశ్నించగా.. ఈ హత్య తమ గ్యాంగ్ పనేనని అతడు అంగీకరించాడు. మూసేవాలాతో తమకు వైరం ఉందని.. అందుకే తమ గ్యాంగ్ సభ్యులు అతడిని చంపేశారని అంగీకరించినట్టు ఇటీవలే పోలీసులు వెల్లడించారు.