ఈమధ్య ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడినా.. దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటున్నాయి. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్ లో గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. మల్లాపూర్ కి చెందిన రౌట్ బాదల్, బొడుప్పల్ కి చెందిన సతీష్, తూర్పు గోదావరికి చెందిన మధు మోహన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుండి సుమారు రూ.3 లక్షల విలువైన గంజాయి లిక్విడ్ ఆయిల్ బాటిల్స్, కేజీన్నర గంజాయి పొడి, మూడు మొబైల్స్, రెండు బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. అరకు, విశాఖ పరిసరాల నుంచి గంజాయి తీసుకొచ్చి విద్యార్థులే లక్ష్యంగా కాలేజీల దగ్గర అమ్మకాలు జరుపుతోంది ఈ ముఠా. నిందితులను రిమాండ్ కు తరలించారు పోలీసులు.