రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో మరోసారి గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. రౌడీ షీటర్ ను టార్గెట్ చేసి కత్తులతో తీవ్రంగా దాడి చేశారు. అతి కష్టం మీద తప్పించుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేందర్ నగర్ లో నివాసం ఉంటున్న సోహెల్ అనే రౌడీ షీటర్ కి.. గంజాయికి అలవాటు పడ్డ హుస్సేన్ అనే వ్యక్తికి గత కొద్ది కాలంగా విభేధాలున్నాయి. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో సోహెల్ పై దాడి చేశాడు హుస్సేన్.
బైక్ పై వస్తున్న సోహెల్ ని అడ్డగించి కళ్లల్లో కారం చల్లి.. గంజాయి గ్యాంగ్ దాడికి పాల్పడింది. కత్తులతో పొడవడంతో మూడు చోట్ల కత్తి పోటు గాయాలు ఉన్నాయి.
వారిని ప్రతిఘటించి తప్పించుకున్న బాధితుడు.. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. హుస్సేన్ అనే వ్యక్తి తో పాటు ముగ్గురుపై కంప్లైంట్ ఇచ్చాడు. సోహెల్ ని ఆస్పత్రికి తరలించి.. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.