ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వరంగల్ కి గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు.వారి వద్దనుంచి 60 వేల విలువ గల 3 కిలోల గంజాయి , 2 సెల్ ఫోన్లు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
వరంగల్ సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్ స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, మిల్స్ కాలనీ పోలీసులు కలిసి నిర్వహించిన తనిఖీలలో సుమంత్, సాయి కుమార్, వికాస్ అనే నిందితుల వద్ద నుంచి 3 కిలోల ఎండు గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను విచారించగా సుమంత్ పై గతంలో కూడా అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఇతడు గంజాయి కొనుగోలు చేసేందుకు కరీంనగర్ నుంచి బయల్దేరే ముందు తన స్నేహితులైన సాయి కుమార్ వికాస్ లను కూడా తీసుకుని వెళ్లాడు.
ముగ్గురు కలిసి వరంగల్ నుంచి మహబూబాబాద్ , భద్రాచలం మీదుగా ఒరిస్సాకి స్కూటీ మీదుగా చేరుకొని అక్కడ మొద్దు వద్ద గంజాయి కొనుగోలు చేసి తిరిగి వరంగల్ చేరుకొని అవసరమైన వారికి 100 గ్రాముల గంజాయిని పాకెట్ ల రూపంలో 500,700 .1000 రూపాయలకు అమ్మేవారు. ఇవి అమ్మడానికి సులువుగా ఉండే ప్రాంతాలని శివనగర్, కాశీబుగ్గ, కరిమాబాద్ మరియు ఖిల్లావరంగల్, చింతల్, లేబర్ కాలనీ ప్రాంతాలని ఎంచుకుని విక్రయాలు జరిపేవారు.
వీరు డబ్బులు ఎక్కువగా సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి సప్లైని పెంచుటకు స్కూల్, కాలేజ్ విద్యార్థులకు గంజాయి తాగడం అలవాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. వీరి ద్వారా ఇప్పటి వరకు మరో 50 మంది గంజాయి తాగేవారిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అధికారులు ఇప్పటి వరకు దాడులు చేసి మొత్తం గా ఇప్పటికీ 13 మంది అమ్మేవారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.