గంటా శ్రీనివాసరావు… అధికారం ఎక్కడుంటే ఆయన అక్కడుంటారు. ఇది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. కానీ టీడీపీ ఓటమి తర్వాత గంటా వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగినా… ఇప్పుడు బీజేపీ గూటికి చేరబోతున్నట్లు ఏపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, గంటాను ఒంటరిగా కాకండా టీడీపీ పని ఖతం చేసేలా పార్టీలోకి ఆహ్వనిస్తోంది బీజేపీ.
గంటాతో పాటు వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య తేలాకే… గంటా కండువా మార్పు ఉంటుందని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీని నామమాత్రం చేసే ఉద్దేశంతో ఉన్న బీజేపీ, వైసీపీకి ధీటైన ప్రతిపక్షపాత్ర పోషించేందుకు ఊవ్విళ్లూరుతోంది. అందుకే గంటాతో మరికొంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని.. ఆ సంఖ్య టీడీపీ శాసనసభా పక్షాన్ని బీజేపీ శాసన సభా పక్షంగా గుర్తించాలని కోరేంతంగా ఉంటుందోని బీజేపీ నేతలు లెక్కలు గడుతున్నారు.
అధికారికంగా టీడీపీకి ఏపీ అసెంబ్లీలో ఉన్న బలం 23. టీడీపీ శాసనసభాపక్షం పేరు మారాలన్నా, రద్దు కావాలన్నా… రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం 2/3వ వంతు సభ్యులు పార్టీ మారేందుకు లేదా ఇతర పార్టీలో కలిపేందుకు ఆసక్తి చూపితే… ఆ సభ్యులపై వేటు పడకపోగా, వారు కోరుకున్న పార్టీకి అనుబంధంగా మారిపోతారు. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్లినప్పుడు కూడా ఇదే సూత్రాన్ని బీజేపి పాటించింది. దీంతో ఇప్పుడూ ఇదే సూత్రాన్ని అవలంబించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకే గంటాను వెంటనే పార్టీలో చేర్చుకోకుండా… సరిపడా ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే… ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా చంద్రబాబకు కాకుండా గంటాకు దక్కే అవకాశం ఉంది. అయితే, ఏపీలో బలపడే అవకాశాన్ని బీజేపీ అసెంబ్లీ వేదికగా మొదలు పెట్టనుందని, మొదట టీడీపీకి ప్రత్యామ్నాయంగా మారబోతుందని బీజేపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా మారిన బీజేపీ కీలక నేత, కేంద్ర సహయ మంత్రి కిషన్‌రెడ్డి ఈ మధ్య రెగ్యులర్ గా విశాఖపట్నం వస్తున్నారని, నెలలోపు రెండు మూడు సార్లు వచ్చి వెళ్లారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాము చట్టప్రకారమే చేస్తున్నామని… ఇందులో ఫిరాయింపులు లేవని బీజేపీ స్పష్టం చేస్తోంది. దీంతో టీడీపీలో కలవరపాటు మొదలైనట్లే కనపడుతోంది.