వైసీపీ వేవ్‌ను తట్టుకొని మరీ గెలిచి వచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు బీజేపీ గూటికి చేరుతారని, వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం సాగింది. అందుకు బలం చేకూర్చుతూ గంటా కూడా టీడీపీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరించటంతో ఆయన పార్టీ మారటం ఖాయమని టీడీపీ శ్రేణులు సైతం ఫిక్స్ అయిపోయాయి.
కానీ అనూహ్యంగా గంటా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనపడుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు ఏకంగా టీడీపీలోకి బీజేపీ కార్యకర్తల చేర్చుకున్నారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారనే వార్తలకు చెక్ పెట్టినట్లయింది.
విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ రాజధాని అని హాడావిడి నడస్తుంటే గంటా టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయం తీసుకోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గంటా పార్టీలు మారటం కొత్తేమీ కాకపోయినా… ఆయన పార్టీ మారుతున్నారంటే ఆయన చేరబోయే పార్టీ మంచి స్థితిలో ఉంటుందన్న నమ్మకం అందరిలోనూ ఉంటుంది. ఆయనే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి రాజకీయంగా మెరుగైన స్థితి ఉంటుంది. దీంతో టీడీపీకి మళ్లీ మంచి రోజులు వస్తున్న కారణంగానే గంటా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనపడుతోందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
విశాఖ రాజధాని అనగానే గంటా లాంటి నేతలు వైసీపీకి జేజేలు కొడతారని అంతా భావించారు. కానీ విశాఖ రాజధాని అంశంతో పాటు వైసీపీ పాలనపై ప్రజల్లో సధాభిప్రాయం లేని కారణంగానే గంటా వైసీపీ బాట పట్టలేదని, ఇక బీజేపీ పవన్‌తో కలవటంతో అటు వైపు కూడా పెద్దగా ఆశించినంత మార్పు ఉండదన్న అభిప్రాయంతోనే గంటా టీడీపీలో కొనసాగనున్నారని విశ్లేషకుల అంచనా.