విజయనగరం : ‘వైసీపీలో చేరాలనుకుంటే నన్ను ఎవరూ ఆపలేరు..’ అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గంటా చేరికకు బ్రేకులు పడ్డాయని మంత్రి అవంతి శ్రీనివాాస్ చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు ఆయన ఈ రిటార్డు ఇచ్చినట్టు భావిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గురించి గంటా ఓ కామెంట్ కూడా పాస్ చేశారు. ఆయన్ని తానసలు ఒక మంత్రిగా పరిగణించడమే లేదని వ్యాఖ్యానించారు.
రాజధానిపై సీఎం మౌనంగా ఉన్నారని.. బొత్స మాత్రమే పదేపదే మాట్లాడుతున్నారని విజయనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గంటా దుయ్యబట్టారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధానిని స్వాగతిస్తున్నామని జగన్ అసెంబ్లీలో చెప్పారని, శివరామకృష్ణ కమిటీ ప్రకారమే అప్పుడు నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేశారు. బీసీల మనోభావాలు దెబ్బ తినడం వల్లే విజయనగరం జిల్లాలో ఓడామని తెలిపారు. టికెట్ల కేటాయింపులో సమతుల్యత లోపించడంతో నష్టం జరిగిందన్నారు.