జగపతిబాబు, వేణు తొట్టెంపూడి కలిసి హనుమాన్ జంక్షన్ లాంటి సూపర్ హిట్ సినిమా చేశారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మరో సినిమాలో నటించారు. వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే, అది ఎక్కువ రోజులు కొనసాగలేదు. జగపతిబాబుతో తనకు చెడిందనే విషయాన్ని వేణు స్వయంగా వెల్లడించాడు.
దాదాపు 16 ఏళ్ల కిందట సంగతి ఇది. ఓ డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత వేణు తొట్టెంపూడిని సంప్రదించాడు. అర్జెంట్ గా డబ్బులు కావాలని అడిగాడు. తెలిసిన వ్యక్తి కావడంతో వేణు కూడా డబ్బు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అయినప్పటికీ ఎక్కువ అమౌంట్ కావడంతో తటపటాయించాడు. ఆ అమౌంట్ మొత్తం రూ.13 లక్షలు. అప్పట్లో అది చాలా ఎక్కువ మొత్తం.
అయితే, అదే టైమ్ లో సదరు వ్యక్తి జగపతిబాబుతో వేణుకు ఫోన్ చేయించాడు. స్వయంగా జగపతిబాబే ఫోన్ చేయడంతో ఇక ఆలోచించకుండా డబ్బులు ఇచ్చేశాడు వేణు. తర్వాత అతడు ఆ డబ్బు ఇవ్వలేదు. జగపతిబాబు కూడా తర్వాత రోజుల్లో ఆ అంశాన్ని మళ్లీ ప్రస్తావించలేదు.
అలా 13 లక్షల రూపాయలు కోల్పోయానని వెల్లడించాడు వేణు. స్వతహాగా వేణు కాస్త సౌండ్ పార్టీ. కాబట్టి రూ.13 లక్షలు కోల్పోవడం ఆయనపై పెద్ద ప్రభావం చూపించలేదు. అయితే, ఆ తర్వాత తిరిగి జగపతిబాబుతో తను మాట్లాడలేదని అన్నాడు. మాట్లాడే అవకాశం కూడా రాలేదని చెప్పాడు.